న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) సెప్టెంబర్ క్వార్టర్లో రూ.102 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) పెరిగినప్పటికీ బ్యాంకు లాభాలను ప్రకటించడం విశేషం. ఈ మొండి బకాయిలకు బ్యాంకు నిధుల కేటాయింపులను తగ్గించడం లాభాలకు కారణంగా తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.1,749.90 కోట్ల నష్టాలను చవిచూసింది.
మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.5,511 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గి, రూ.4,967 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు బ్యాంకు మొత్తం రుణాల్లో 17.24 (రూ.25,673 కోట్లు) శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 16.30 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 10.07 శాతంగా (రూ.13,795 కోట్లు) ఉన్నాయి. బ్యాంకు మొత్తం ప్రొవిజన్లు రూ.1,073 కోట్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ప్రొవిజన్లు రూ.3,146 కోట్లుగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment