పానాసోనిక్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్
ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్
న్యూఢిల్లీ: పానాసోనిక్ ఇండియా తాజాగా ‘ఎలుగా రే మ్యాక్స్’, ‘ఎలుగా రే ఎక్స్’ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటిల్లో ‘ఎలుగా రే మ్యాక్స్’ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యంకానుంది. 32 జీబీ వేరియంట్ ధర రూ.11,499గా, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఇక ‘ఎలుగా రే ఎక్స్’ ధర రూ.8,999గా ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే వర్చువల్ అసిస్టెంట్ అనే ‘ఎర్బో’ ఫీచర్ ఉంది. ఇది ఒకరకంగా యాపిల్ సిరి లాంటిదే. వర్చువల్ అసిస్టెంట్ అనేది ఒక సెల్ఫ్–లెర్నింగ్ టెక్నాలజీ. ఇది యూజర్‌కు ఇంటెలిజెంట్ యూసేజ్‌కు సంబంధించి తగిన సూచనలు అందిస్తుంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
‘ఎలుగా రే మ్యాక్స్’లో 5.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 గిగాహెర్ట్‌జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ‘ఎలుగా రే ఎక్స్’లో 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెర్ట్‌జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపింది.