
కొత్త ఏడాదీ నోట్ల కోసం క్యూలే!
ఇబ్బందులు ఇంకా ముగియలేదన్న బ్యాంకర్లు
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి సరిగ్గా నాలుగు రోజులే మిగిలి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్ 30 తర్వాత నగదు ఉపసంహరణలపై పరిమితులు ఎత్తివేసే అవకాశాలూ కనిపించడం లేదు. ఈ నెల 30 తర్వాత కూడా రద్దీ తగ్గే అవకాశం లేదని, కొత్త సంవత్సరంలోనూ కస్టమర్లు నగదు కోసం బారులు తీరాల్సిన పరిస్థితులే కొనసాగుతాయని బ్యాంకు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.
‘‘బ్యాంకుల వద్ద ఇప్పటికీ రద్దీ ఉంది. ఈ పరిస్థితి మారుతుందన్న ఆశలేవీ లేవు. ఆర్‌బీఐ బ్యాంకులకు అవసరమైన నగదులో 20 నుంచి 30 శాతమే అందిస్తుంటే పరిస్థితి ఎలా మారుతుంది?’’ అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం అన్నారు. పరిస్థితి ఏమీ మెరుగుపడలేదని, దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు లేఖ ద్వారా తెలిపినా ఎలాంటి స్పందన లేదన్నారు. దేశవ్యాప్తంగా కట్టల కొద్దీ కొత్త నోట్ల కట్టలు పట్టుబడడం, సరైన కస్టమర్లకు అవి అందకపోవడంపై ఆర్‌బీఐ మౌనం వహించడం ద్వారా... బ్యాంకింగ్ వ్యవస్థపై కస్టమర్ల నమ్మకాన్ని తుడిచేసిందని మండిపడ్డారు. టీవీలు, పేపర్లలో వార్తలు చూస్తుంటే ఇదంతా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నట్టు ఉందని, ఆ నగదును తామే పక్కదారి పట్టిస్తున్నట్టు అపోహలు కలిగిస్తోందన్నారు.