గోల్డా... పర్సనలా? ఎందులోనైతే బెటర్‌? | Personal Loan on Gold | Sakshi
Sakshi News home page

గోల్డా... పర్సనలా? ఎందులోనైతే బెటర్‌?

Published Mon, Jul 24 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

గోల్డా... పర్సనలా? ఎందులోనైతే బెటర్‌?

గోల్డా... పర్సనలా? ఎందులోనైతే బెటర్‌?

రెండింటికీ వడ్డీ రేట్లలో అధిక వ్యత్యాసం   
వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు చౌక   ∙
♦  క్రెడిట్‌ స్కోరు తక్కువున్నా బంగారంపై రుణం  
తిరిగి చెల్లించడంలోనూ నిబంధనలు వేర్వేరు  ∙
బంగారం రుణాల తిరిగి చెల్లింపు చాలా ఈజీ  


బంగారమంటే... బంగారమే. పొదుపు, పెట్టుబడులకు ఇప్పటికీ ఇదో చక్కని  సాధనమే. అదేకాదు. బంగారంపై రుణాల మార్కెట్‌ కూడా పెద్ద్దదే. పర్సనల్‌ లోన్‌ లాంటివాటికి బంగారంపై రుణాలు ప్రత్యామ్నాయం కూడా. మరి బంగారంపై రుణం తీసుకుంటే మంచిదా... లేక పర్సనల్‌ లోన్‌ బెటరా? దీనికి సమాధానం కోసం... తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం...

ఇంతకీ వడ్డీ రేటెంత?
వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు 10.99 శాతం నుంచి 24 శాతం మధ్య ఉన్నాయి. పనిచేసే సంస్థ, నెలవేతనం, తిరిగి చెల్లించే కాల వ్యవధి, రుణం మొత్తం, రుణమిచ్చే సంస్థను బట్టి వడ్డీ రేట్లు మారతాయి. మీ క్రెడిట్‌ స్కోరు కూడా వడ్డీ రేటును ప్రభావితం చేస్తుందండోయ్‌!! ఇక బంగారం రుణాలపై వడ్డీ రేట్లు 12 నుంచి 24 శాతం వరకూ ఉన్నాయి. ఇవి కూడా రుణ కాల వ్యవధి, బంగారం విలువలో ఎంత మేర రుణమిస్తున్నారు (ఎల్‌టీవీ), తిరిగి చెల్లించే పద్ధతేంటి? వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు పెరుగుతుంది. అలాగే మీ బంగారం విలువలో ఎంత ఎక్కువ మొత్తాన్ని రుణంగా తీసుకుంటే వడ్డీ అంత ఎక్కువవుతుంది. కాస్త మంచి సంస్థలో పనిచేస్తూ మంచి క్రెడిట్‌ స్కోరున్నవారికి 12–13 శాతానికి పర్సనల్‌ లోన్‌ దొరుకుతోంది. అలాంటపుడు అదే బెటర్‌ కదా!!

తీసుకుంటున్న రుణమెంత?
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు రూ.50,000 నుంచి రూ.25 లక్షల శ్రేణిలో వ్యక్తిగత రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. పైన చెప్పుకున్నట్టు నెలసరి వేతనం, ఇప్పటికే రుణాలు తీసుకుని ఉన్నారా? రుణ కాల వ్యవధి, పనిచేస్తున్న సంస్థ ఎలాంటిది? ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారు? రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డారా? వంటివన్నీ ఎంత రుణాన్ని ఇవ్వాలన్న అంశాన్ని నిర్ణయిస్తాయి. బంగారం రుణాల విషయానికొస్తే రూ.1,000 నుంచి రూ.కోటి వరకు కంపెనీలు ఇస్తున్నాయి. బంగారంపై రుణాలు సెక్యూర్డ్‌ కిందకు వస్తాయి. భద్రత ఎక్కువ. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి బంగారాన్ని హామీగా పెడతారు కనక. ఎంత మేర బంగారాన్ని హామీగా పెడుతున్నారన్నది కీలకం. ఎందుకంటే ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు బంగారం విలువలో 75 శాతానికి మించి రుణాలు ఇవ్వరాదన్నది ఆర్‌బీఐ నిబంధన. ఇక, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులైతే గోల్డ్‌పై రూ.2 లక్షలకు మించి రుణాలివ్వడానికి నిబంధనలు అనుమతించడం లేదు. కాబట్టి ఎక్కువ మొత్తానికి వ్యక్తిగత రుణమే బెటర్‌.

తీర్చే కాల వ్యవధి తక్కువేనా?
వ్యక్తిగత రుణాలు ఏడాది నుంచి ఐదేళ్ల కాల వ్యవధికి లభిస్తుంటే, బంగారం రుణాలు మాత్రం ఏడు రోజుల నుంచి నాలుగేళ్ల కాల వ్యవధిపై అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు ఏడాది కాల వ్యవధి వరకు బంగారంపై రుణాలిస్తున్నాయి.

పర్సనల్‌కు ప్రాసెసింగ్‌ ఎక్కువే!!
వ్యక్తిగత రుణం కావాలంటే కొంత సమయం తీసుకుంటుంది. బంగారంపై రుణాన్ని చాలా సంస్థలు అదే రోజు కూడా జారీ చేస్తున్నాయి. వ్యక్తి గత రుణాల జారీకి మాత్రం రెండు నుంచి ఏడు రోజులు పడుతుంది. తక్షణం రుణం కావాలంటే గోల్డ్‌ లోనే బెటరనుకోవచ్చు.

ఆన్‌లైన్‌ సౌకర్యానికి వ్యక్తిగత రుణమే!
సౌకర్యం విషయంలో మాత్రం వ్యక్తిగత రుణమే మంచిదని చెప్పాలి. ఎందుకంటే రుణానికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటే, ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాకు రుణం జమవుతుంది. బ్యాంకు శాఖ వరకూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ, బంగారంపై రుణం కావాలంటే మీ దగ్గరున్న బంగారంతో రుణమిచ్చే సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే బంగారం విలువను మదింపు వేయాలి. దరఖాస్తు, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.

క్రెడిట్‌ స్కోరు తక్కువైతే గోల్డే!!
వ్యక్తిగత రుణాలకు క్రెడిట్‌ స్కోరు అవసరం ఉంటుంది. చాలా బ్యాంకులు క్రెడిట్‌ స్కోరు తక్కువుంటే రుణ దరఖాస్తును నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నాయి. అదే బంగారంపై రుణమైతే హామీగా బంగారం ఉంటుంది గనుక క్రెడిట్‌ స్కోరు పాత్ర కీలకం కాదు. అయినా పెద్ద మొత్తం రుణానికి క్రెడిట్‌ స్కోరు కూడా చూస్తారు.

తిరిగి చెల్లించేది ఎలా?
వ్యక్తిగత రుణాన్ని నెలవారీ ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాయిదా వడ్డీతోపాటు రుణంలో కొంత మేర కలిపి ఉంటుంది. సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే వార్షికంగా 24 శాతం వడ్డీతో లేట్‌ పేమెంట్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. బంగారంపై రుణం తీసుకుంటే ప్రతీ నెలా వడ్డీ చెల్లిస్తూ గడువు చివర్లో అసలు చెల్లించొచ్చు. అలాగే, వడ్డీ, అసలు కలిపి నెలవారీ వాయిదాగానూ చెల్లించే వెసులుబాటు ఉంది. అలాగే, బుల్లెట్‌ పేమెంట్‌ ఆప్షన్‌ ఉంది. మధ్య మధ్యలో వెసులుబాటు ఉన్నప్పుడు అదనంగా చెల్లించుకుంటూ వెళ్లొచ్చు.
దీన్నిబట్టి చూస్తే రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో బంగారం రుణాల్లో సౌలభ్యం ఎక్కువ. అలాగే, రుణం కూడా వేగంగా పొందొచ్చు. వేతన జీవులకైతే పర్సనల్‌ లోన్‌ చౌక. మంచి క్రెడిట్‌ స్కోరు ఉండి, పేరున్న సంస్థలో పనిచేస్తుంటే తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందొచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారికి మాత్రం పర్సనల్‌ లోన్‌ రావడం కొంచెం కష్టమే. వీరికి బంగారం రుణం ప్రత్యామ్నాయం. రుణం తీసుకునే ముందు ఇవన్నీ తెలుసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement