
న్యూఢిల్లీ: ఇంధనాల రిటైలింగ్ వ్యాపారంలో పోటీని ప్రోత్సహించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం లైసెన్సింగ్ నిబంధనలను సరళీకరించాలనే ఉద్దేశంతో... నిపుణుల కమిటీని నియమించింది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు తోడ్పడే అంశాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే.. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్ల లేదా ద్రవీకృత సహజ వాయువు టర్మినల్స్ ఏర్పాటు మొదలైన వాటిపై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో రిటైలింగ్ లైసెన్స్ నిబంధనలను సడలించడానికి తగ్గ చర్యలను ఈ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుందని కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. మరిన్ని సంస్థలు, పంప్‌ల రాకతో ధరలపరంగా, సర్వీసులపరంగా రిటైల్ కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారులకు ప్రయోజనం చేకూరగలదని చమురు శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు .. రిటైల్ రేటును నిర్ణయించేందుకు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రేట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు.
కిరీట్ పారిఖ్ సారథ్యంలో..
ప్రముఖ ఆర్థిక వేత్త కిరీట్ పారిఖ్, చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఐఓసీ మాజీ చీఫ్ ఎంఏ పఠాన్ ఈ కమిటీలో ఉంటారు. సంబంధిత వర్గాలతో చర్చించి కమిటీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఇంధనాల మార్కెటింగ్‌కి సంబంధించి లైసెన్సింగ్ విధానం, ప్రైవేట్ సంస్థల వాటా తదితర అంశాలను కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలు మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా ఉన్న అంశాలను గుర్తించి తగు సిఫార్సులు చేస్తుంది.
సింహభాగం పీఎస్‌యూలదే ..
ప్రస్తుతం దేశీయంగా 63,498 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి. వీటిలో సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలవే (పీఎస్‌యూ) ఉన్నాయి. ఐవోసీ అత్యధికంగా 27,325, భారత్ పెట్రోలియంకి 15,255, హెచ్‌పీసీఎల్‌కి 14,565 పంప్‌లున్నాయి. మరోవైపు, ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్‌కి 1,400, నయారా ఎనర్జీకి (గతంలో ఎస్సార్ ఆయిల్) 4,833, రాయల్ డచ్ షెల్‌కి 114 పంప్‌లున్నాయి.
బ్రిటన్‌కి చెందిన బీపీ భారత్‌లో 3,500 పంప్‌లు ఏర్పాటుకు లైసెన్సులు పొందినప్పటికీ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అటు ఫ్రెంచ్‌కి చెందిన టోటల్ సంస్థ అదానీ గ్రూప్‌తో కలిసి 10 ఏళ్లలో 1,500 పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యం లో లైసెన్సింగ్ నిబంధనల సడలింపునకు కమిటీని ఏర్పాటు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment