
సాక్షి, తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇంధన ధరలకు చెక్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనంపై రీటైల్ వాట్‌ను తగ్గించనుంది. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరల వాత తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వామపక్ష పాలక రాష్ట్రం కేరళలో పెట్రోల్, డీజిల్ ధరల స్వల్పంగా నైనా శాంతించనుండటం విశేషం.
జూన్ 1వ తేదీ శుక‍్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై ఒక రూపాయి తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. పెట్రోల్‌పై పన్నుపై కోత పెట్టడం ద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ .2 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించగా, నాలుగు రాష్ట్రాలు కేవలం వాట్ కట్‌ను ప్రకటించాయి. కాగా గత 16 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే గ్లోబల్‌గా చమురు ధరలు శాంతించడంతో దేశీయంగా బుదవారం 1 పైసా ధర తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భగ్గుమన్న ధరలను భరిస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా మండిపడ్డారు. చమురు ధరలు చల్లబడిన తరువాత కూడా లీటరుకు కేవలం ఒక పైసా తగ్గింపుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment