స్టాక్ మార్కెట్లో రూ.5000 కోట్ల పీఎఫ్ పెట్టుబడులు | PF investment of Rs 5,000 crore in the stock market | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో రూ.5000 కోట్ల పీఎఫ్ పెట్టుబడులు

Published Fri, Aug 7 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

స్టాక్ మార్కెట్లో రూ.5000 కోట్ల పీఎఫ్ పెట్టుబడులు

స్టాక్ మార్కెట్లో రూ.5000 కోట్ల పీఎఫ్ పెట్టుబడులు

సెన్సెక్స్, నిఫ్టీ ఆధారిత ఈటీఎఫ్‌ల ఎంపిక
ముంబై:
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 5,000 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి దీన్ని 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన రెండు ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్‌ల ద్వారా ఈ పెట్టుబడులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వీటిలో ఒకటి బీఎస్‌ఈ సెన్సెక్స్‌పై, మరొకటి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీపై ఆధారితమై ఉంటాయి.

ముందుగా ఈపీఎఫ్‌వో ఏటా తనకొచ్చే చందాలో సుమారు 5 శాతం (దాదాపు రూ. 5,000 కోట్లు) ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుందని దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో తమ చందాదారులకు ఇస్తున్న 8.75 శాతం రాబడితో పోలిస్తే ఈటీఎఫ్‌ల ద్వారా మరింత ఎక్కువ రాగలదని ఆయన పేర్కొన్నారు. సెబీ హోల్‌టైమ్ మెంబర్ ఎస్ రామన్, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, బీఎస్‌ఈ చీఫ్ ఆశీష్ కుమార్ చౌహాన్, సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాక్‌మార్కెట్లో పెన్షన్ ఫండ్లు పెట్టుబడులు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదేనని, దీని వల్ల అధిక రాబడి ప్రయోజనాలూ ఉన్నాయని చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈపీఎఫ్‌వోకి ప్రస్తుతం రూ. 6.5 లక్షల కోట్ల మేర నిధులు ఉన్నాయి.
 
75% ఎన్‌ఎస్‌ఈ ఈటీఎఫ్‌లో: ప్రాథమికంగా చేసే ఇన్వెస్ట్‌మెంట్‌లో 75 శాతాన్ని ఎన్‌ఎస్‌ఈ ఆధారిత ఈటీఎఫ్‌లోనూ, మిగతాది బీఎస్‌ఈ ఈటీఎఫ్‌లోనూ పెట్టనున్నట్లు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ తెలిపారు. అవసరమైతే సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. ఓఎన్‌జీసీ వంటి సంస్థలు కూడా తమ నిధులను ఈక్విటీల్లో పెట్టదల్చుకుంటే స్టాక్ మార్కెట్లో పీఎఫ్ చేసే ఇన్వెస్ట్‌మెంటు రూ. 7,000-8,000 కోట్ల దాకా పెరగొచ్చని జలాన్ చెప్పారు.

ఎస్‌బీఐ ఎంఎఫ్.. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలను తగ్గించడంతో ఇవి సుమారు అయిదు బేసిస్ పాయింట్ల స్థాయిలో ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్ పెట్టుబడుల పరిస్థితిని సమీక్షించి, వచ్చే సంవత్సరం నుంచి 15%పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తర్వాత ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతి పెద్ద సంస్థగా ఈపీఎఫ్‌వో నిలుస్తుంది. ఎల్‌ఐసీ ఏటా రూ. 50,000 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement