
జీతాలివ్వకుంటే పనిచేయం..
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజనీర్లకు వరుసగా రెండో నెలలో కూడా జీతాల చెల్లింపులో జాప్యం చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు తాజాగా పైలట్లు గట్టి షాక్ ఇచ్చారు. తమకు జీతాల చెల్లింపులో జాప్యానికి నిరసనగా తాము సహాయ నిరాకరణ చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ముందస్తు నోటీసు లేకుండా జీతాలను నిలిపివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సంస్థలో జరిగే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలని జెట్ ఎయిర్‌వేస్‌కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తమ సమస్యను పరిష్కరించడంతో పాటు సకాలంలో జీతాల చెల్లింపులో విఫలమైతే తాము సహాయ నిరాకరణ చేపడతామని యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు.
ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత విధించేందుకు కంపెనీ ప్రయత్నించగా పైలట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కితగ్గిందని నేషనల్ ఏవియేటరక్స్ గిల్డ్ అలండ్ ఇంజనీర్స్ వెల్లడించింది. కాగా, పైలట్ల వార్నింగ్‌పై జెట్ ఎయిర్‌వేస్ ఇంకా స్పందించలేదు.