ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన భారీ కుంభకోణంతో, వేల సంఖ్యలో ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగంలో పనిచేసే దాదాపు 10వేల మంది ఉద్యోగులపై పీఎన్‌బీ స్కాం ప్రతికూల ప్రభావం చూపనుందని తాజా రిపోర్టు వెల్లడించింది. నీరవ్ మోదీ సంస్థలు, గీతాంజలి గ్రూప్‌కు చెందిన వ్యాపారాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో, ఈ ప్రభావం జువెల్లరీ రంగంపైనా పడుతోందని పేర్కొంది. అంతేకాక బ్యాంకింగ్ రంగంలో 11 శాతంగా ఉన్న జెమ్స్, జువెల్లరీల నిరర్థక ఆస్తులు, 30 శాతానికి పెరుగనున్నాయని కేర్ రేటింగ్స్ రిపోర్టు వెల్లడించింది.
నీరవ్ మోదీ సంస్థలు, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన సంస్థలు కలిసి తమ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే ఇరువురికి చెందిన సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు కొరడా ఝుళిపించాయి. దీంతో తాము వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేమని, వేరేది చూసుకోడంటూ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు తన ఉద్యోగులకు లేఖ రాశారు.
గీతాంజలి గ్రూప్, నీరవ్ మోదీ సంస్థలు మూత ప్రభావం:
- జువెల్లరీ రంగంలో విదేశీ వాణిజ్యం 2018-19లో 5 శాతం నుంచి 6 శాతం తగ్గనుంది.
- మొత్తంగా జువెల్లరీ విక్రయాలపై 16 శాతం ప్రభావం పడనుంది
- ఈ రెండు సంస్థలకు చెందిన 3వేల మంది శాశ్వత ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. మరో 7వేల నుంచి 8వేల మంది తాత్కాలిక ఉద్యోగులపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం
- జువెల్లరీ రంగంలో ఎన్‌పీఏలు 30 శాతం పెరుగనున్నాయి
బ్యాంకులపై ఎన్‌పీఏల ప్రభావం
జువెల్లరీ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.21వేల కోట్లకు పైన ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గీతాంజలి జెమ్స్, నీరవ్ మోదీ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు ఉన్నట్టు ఆర్‌బీఐ డేటాలో తెలిసింది. కేవలం ఉద్యోగవకాశాలు, బ్యాంకులపైనే కాక, ఈ స్కాం అంతర్జాతీయ వ్యాపారం, దేశీయ రెవెన్యూలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
అందుబాటులో ఉన్న 22 కంపెనీల డేటా ప్రకారం జువెల్లరీ రంగంలో మొత్తం 22వేల మంది ఉద్యోగులున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు చెందిన కంపెనీల్లోనే 12-15 శాతం మంది ఉద్యోగులున్నారని కేర్ రేటింగ్స్ తెలిపింది. దేశంలో గీతాంజలి జెమ్స్ అతిపెద్ద జువెల్లరీ రిటైలర్స్‌గా ఉంది. దీని మార్కెట్‌రూ.3,90,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment