మీడియాతో ఇన్వెస్టర్, బాధితుడు వైభవ్ ఖురానియా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో భారీ కుంభకోణం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. 1.77 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలగా... ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. అయితే స్కామ్ డ్రామా ఇప్పుడు మొదలైంది కాదని, 2011-12లో ఇందుకు బీజం పడిందని గీతాంజలి గ్రూపులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ఇన్వెస్టర్, బాధితుడు వైభవ్ ఖురానియా తెలిపారు. 2013కి వచ్చేసరికి స్కామ్ ముదిరి పాకాన పడిందని, కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ వర్గాలు తన ఫిర్యాదును పట్టించుకోలేదని పీఎన్‌బీ స్కామ్ కేసుపై పిటిషన్ దాఖలుచేసిన వైభవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐకి, సెబీకి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఈఓడబ్ల్యూ.. ఇలా అన్ని సంస్థల అధికారులకు మోసాల గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఒకవేళ అదే సమయంలో అప్రమత్తమై ఉంటే వ్యాపారి నీరవ్‌మోదీ దేశాన్ని వదిలి పారిపోయేవాడే కాదన్నారు. తొలుత దీనిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కాలేదని, ప్రస్తుతం కోర్టు వరకు విషయం వెళ్లగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారని వివరించారు. 'గీతాంజలి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు మేం మెహల్‌చోక్సీని కలిశాం. ఓ స్టోర్‌ను ప్రారంభించిన రెండు నెలల్లోనే పతనావస్థకు చేరుకున్నాం. కేవలం 3-4 నెలల్లోనే స్టోర్‌ను మూసివేశాం. గీతాంజలి యాజమాన్యం మమ్మల్ని దారుణంగా మోసగించింది. రూ.80 లక్షల విలువైన మా స్టాక్ (ఆభరణాలు, ఉత్పత్తులు)ను చోరీ చేసిందని' పిటిషనర్ వైభవ్ ఖురానియా వివరించారు.
మరోవైపు నీరవ్‌మోదీ, గీతాంజలి గ్రూపుల సంస్థలపై ఈడీ దాడులు ఐదోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బ్యాంకు నియంత్రణ వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్నామని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. పీఎన్‌బీ కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment