ముంబై : పంజాబ్ నేషన్ బ్యాంకు భారీ కుంభకోణం కేసు సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంకులుగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు దర్యాప్తు సంస్థలు షాకిచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ) సమన్లు జారీచేసింది. చందా కొచ్చర్‌తో పాటు యాక్సిస్ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు కూడా నోటీసులు అందాయి. పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మోహుల్ చౌక్సిలకు సంబంధించే వీరికి నోటీసులు అందినట్టు తెలిసింది. అయితే నీరవ్‌మోదీ సంస్థలతో తమకేమీ సంబంధం లేదని, చౌక్సికి చెందిన గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం అందించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.
అయితే ఎంత రుణం ఇచ్చామో ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించలేదు. యాక్సిస్ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూప్‌కు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. మరోవైపు గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ విపుల్ చిటిలియాను సీబీఐ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. పీఎన్‌బీ స్కాంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నిస్తోంది. సీబీఐ ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు, యాక్సిస్ బ్యాంకు షేరు నష్టాల బాట పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment