వీటిని గమనించాల్సిందే.. | policy documents upon receiving to consider the important elements | Sakshi
Sakshi News home page

వీటిని గమనించాల్సిందే..

Published Sun, Apr 13 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

వీటిని గమనించాల్సిందే..

వీటిని గమనించాల్సిందే..

జీవిత బీమా ప్రాధాన్యంపై దేశంలో అవగాహన పెరుగుతోంది. రిస్క్ కవరేజీ, దీర్ఘకాలిక పొదుపు, పన్ను ప్రయోజనాలు - ఈ మూడింటినీ సమకూర్చేది జీవిత బీమా మాత్రమే. తాము కొనుగోలు చేస్తున్న పాలసీల గురించి ప్రజలు క్షుణ్నంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అవి మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయనే అంశం పాలసీ డాక్యుమెంట్లలో వివరంగా ఉంటుంది.

పాలసీ పత్రాలు మీ చేతికి అందగానే పరిశీలించాల్సిన పది ముఖ్యమైన అంశాలు ఇవీ;
వ్యక్తిగత వివరాలు...
 క్లెయిమ్‌లను పరిష్కరించే సమయంలో వ్యక్తిగత వివరాలు కీలక పాత్ర పోషిస్తాయి. కనుక, పాలసీ డాక్యుమెంట్లలోని మీ వివరాలు అంటే పేరు, వయసు తదితరాలు సరిగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్యం వివరాలు కూడా కరెక్టుగా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ ఈ వివరాలు సరిగా లేని పక్షంలో క్లెయిమ్ తిరస్కారానికి గురయ్యే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి.

ప్రయోజనాలను చూడండి..
దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా జీవిత బీమా పాలసీ ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలో ఇచ్చిన హామీలు పాలసీ డాక్యుమెంట్లలో ఉన్నాయా అనేది తనిఖీ చేయాలి. బీమా చేసిన మొత్తం, ప్రీమియం, ప్లాన్ ఫ్లెక్సిబిలిటీ తదితరాలను గమనించాలి.

 రైడర్లను గమనించాలి...
జీవిత బీమాతో పాటు ఇతర రకాల అత్యవసరాల కోసం మీరు యాడ్ ఆన్ కవర్స్(రైడర్లు)ను కొనుగోలు చేసి ఉండవచ్చు. వీటిని పాలసీ డాక్యుమెంట్లో చేర్చారా అనే విషయాన్ని పరిశీలించండి. పాలసీలో రైడర్లను చేర్చకపోతే, తీవ్ర అస్వస్థతకు గురై క్లెయిమ్ చేసిన సమయంలో నిరాశ ఎదురుకావచ్చు.

చెల్లింపుల వ్యవధి...
మీ అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రీమియంను ఎంతకాలం చెల్లించేదీ ముందుగానే నిర్ణయించుకుని ఉంటారు. ప్రీమియంలను మూడు నెలలు లేదా ఆరునెలలకోసారి చెల్లించడానికి మీరు సిద్ధపడి ఉండవచ్చు. పాలసీ పత్రంలో ఈ వివరాలను చెక్ చేసుకోవాలి.

రిటర్నులపై కన్ను...
ఆదాయ హామీలను గుడ్డిగా నమ్మవద్దు. పాలసీ డాక్యుమెంట్లు చేతికి రాగానే రిటర్నుల గురించిన వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయండి. గ్యారంటీ ఉన్న అంశాలను, గ్యారంటీ లేని అంశాలను పరిశీలించండి.
సర్వీసు కాంట్రాక్టు: డాక్యుమెంట్లో పేర్కొన్న బెనిఫిట్లతో పాటు సర్వీసు కాంట్రాక్టులోని నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. వాటిని ఆకళింపు చేసుకోవడం కష్టంగా ఉంటే, ఆ నిబంధనల ప్రభావం గురించి బీమా కంపెనీని సంప్రదించండి.

 సరెండర్ చార్జీలు...
అత్యవసర సమయాల్లో ప్రజలు తమ పాలసీలను సరెండర్ చేస్తారు. లేదంటే పాక్షికంగా ఉపసంహరించుకుంటారు. కనుక, సరెండర్ చార్జీలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలి. తద్వారా మీ ఆర్థిక అవసరాలను మదింపు చేసుకుని, నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.

మినహాయింపులను గమనించాలి...
ఏయే పరిస్థితుల్లో బీమా కవరేజీ ఉండదో వాటిని మినహాయింపులని అంటారు. వీటి గురించి తెలుసుకోకపోతే కవరేజీ నిరుపయోగమయ్యే అవకాశముంది. కనుక, మినహాయింపులన్నిటినీ పరిశీలించాలి. ఆత్మహత్య, నేరానికి పాల్పడుతుండగా మృత్యువుకు గురికావడం, యుద్ధం, ఉగ్రవాద దాడుల్లో మరణించడం... వంటి అంశాలు మినహాయింపుల జాబితాలో ఉండవచ్చు. కొన్ని మినహాయింపులు నిర్ణీత కాలవ్యవధి వరకే ఉంటాయి. కనుక వీటిని పరిమితులని వ్యవహరించవచ్చు. చాలా రకాల జీవిత బీమా పాలసీల్లో నిర్ణీత కాలం వరకు కొన్ని రకాల మరణాలకు కవరేజీని నిరాకరిస్తారు.

నామినీలు: పాలసీ డాక్యుమెంట్లో నామినీల వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూడండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని మీరు నామినీలుగా పేర్కొనవచ్చు. క్లెయిమ్‌లో వారి వాటా ఎంతో నిర్దిష్టంగా చెప్పాలి.

పాలసీ నచ్చకపోతే: జీవిత బీమా కంపెనీలన్నీ తమ పాలసీదారులకు 15 రోజుల గడువును ఇస్తాయి. పాలసీ విక్రయ సమయంలో ఏజెంటు చెప్పిన అంశాలు డాక్యుమెంట్లో లేకపోవడం వంటి కారణాల వల్ల పాలసీదారులు అసంతృప్తి చెందితే పాలసీని తిరిగి ఇచ్చెయ్యవచ్చు. తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement