సాక్షి, చెన్నై: దేశప్రజలంతా సంక్రాంతి ఉత్సాహంతో ఉరకలేస్తోంటే.. చెన్నై విమానాలు మాత్రం గాల్లోకి ఎగరలేక తెల్లబోవడంతోవిమాన ప్రయాణీకులు మాత్రం ఉసూరుమంటున్నారు. దట్టమైన పొగ కారణంగా దాదాపు 10 విమానాలు టేక్‌ఆఫ్‌లు, లాండింగ్‌లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నైనుంచి బయలు దేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 18 విమానాలను హైదరాబాద్, బెంగళూరు వైపు మళ్లించారు. చెన్నై నగరంలో ‘భోగి’ మంటల వల్ల వ్యాపించిన దట్టమైన పొగతో ఎయిర్‌క్వాలిటీ, రన్‌వే విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో ప్రయాణీకుల ఆందోళన నెలకొంది.
విమానాశ్రయ సీనియర్ అధికారి మాట్లాడుతూ రన్‌వే దృశ్యమానత 50 మీటర్లకు పడిపోయిందనిచెప్పారు. ఉదయం మూడున్నరనుంచి తమకు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరికొన్ని గంటల్లో పరిస్థితి చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ముంబైలో చాలా ముఖ్యమైన బిజినెస్ మీట్ వుందంటూ భరత్ జైన్ వాపోయారు. చెన్నైకు భోగి మంటలు ఒక ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయని మరో సీనియర్ అధికారి తెలిపారు. గతపదేళ్లుగా ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు తమిళనాడులో అవగాహన పెంచుతోందన్నారు.
ఇది ఇలా ఉంటే.. చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుఝామునుంచే సందడి మొదలైంది. పాత బట్టలు, వస్తువులను తగలబెట్టడం శుభాన్నిస్తుందని , అంతేకాదు భోగిమంటలు గాలిని శుభ్రం చేస్తాయని స్థానికుడు కరుప్పన్ సంతోషంగా చెప్పారు. తమిళ సంస్కృతిలో 'భోగీ' ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈపొగ గాలిని కలుషితం చేస్తుందని తెలుసు.. అందుకే తాము ప్లాస్టిక్స్ , టైర్లను నివారిస్తామని చెన్నైవాసి శరవణన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment