ఎన్‌పీఎస్‌లో.. పెడుతున్నారా..? | The possibility of increasing equity allocation limit | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌లో.. పెడుతున్నారా..?

Mar 12 2018 12:13 AM | Updated on Mar 12 2018 12:13 AM

The possibility of increasing equity allocation limit - Sakshi

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో (ఎన్‌పీఎస్‌) పెట్టుబడుల తీరుతెన్నులను మార్చాలని పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ, అభివృద్ధి  సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) యోచిస్తోంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం 50 శాతానికే పరిమితమైన ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్ని ఇకపై 75 శాతం దాకా పెంచేలా ప్రతిపాదిస్తోంది. దీనిపై అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎందుకిలా? ఒకవేళ ఇలా చేస్తే చందాదారులకు కలిగే లాభనష్టాలేంటి? ఒకసారి చూద్దాం... –  సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో నాలుగు రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అవి..
1. ప్రభుత్వ సెక్యూరిటీస్‌ ఫండ్‌ లేదా స్కీమ్‌ జీ
2. కార్పొరేట్‌ బాండ్స్‌ ఫండ్‌ లేదా స్కీమ్‌ సి
3. ఈక్విటీస్‌ ఫండ్‌ లేదా స్కీమ్‌ ఈ
4. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ లేదా స్కీమ్‌ ఎ.

వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి.
మొదటిది...  లైఫ్‌ సైకిల్‌ ఆధారిత విధానం. ఇందులో మీ వయసు ఆధారంగా పెట్టుబడులు పెట్టేలా ముందే నిర్ణయించిన లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ ప్లాన్‌ ఉంటుంది. దీని ప్రకారం 35 ఏళ్లు వచ్చే దాకా ఈక్విటీలకు గరిష్టంగా 50% కేటాయించవచ్చు. 55 ఏళ్లు వచ్చేసరికి ఇది 10 శాతానికి తగ్గిపోతుంది. అయితే 2016లో కొత్తగా మరో రెండు లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఒక దాని తీరు దూకుడుగా ఉండేది కాగా.. ఇంకొకటి కాస్త సంప్రదాయబద్ధంగా ఉండేది.

దూకుడుగా ఉండే అగ్రెసివ్‌ లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ విధానంలో 35 ఏళ్లు వచ్చే దాకా గరిష్టంగా 75% మేర ఈక్విటీలకు కేటాయించవచ్చు. అదే సాంప్రదాయబద్ధంగా ఉండే కన్జర్వేటివ్‌ ఆప్షన్‌లో ఇది 25 శాతమే. 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీలకు కేటాయింపులు అగ్రెసివ్‌ ఫండ్‌ విధానంలోనైతే 15 శాతానికి, కన్జర్వేటివ్‌ విధానంలోనైతే 5 శాతానికి తగ్గిపోతాయి. ఈ లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ విధానంలో ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ జోలికి వెళ్లవు.

ఇక, రెండవది యాక్టివ్‌ విధానం. ఇందులో ఏ దశలో కూడా ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతానికి మించవు. అయితే, అంతర్గత పరిమితులకు లోబడి ఇన్వెస్టర్లు.. నాలుగింట్లో ఏ స్కీములోనైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. నిర్దిష్ట పరిమితి దాకా కేటాయింపులు చేయొచ్చు. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాత్రం పరిమితి 5 శాతమే.

ఈ యాక్టివ్‌ విధానంలోనే ఈక్విటీల్లో ఇప్పటిదాకా 50 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 75% దాకా పెంచాలని పీఎఫ్‌ఆర్‌డీఏ యోచిస్తోంది. అయితే, దీన్లోనూ ఓ మెలిక ఉంది. అది... 50 ఏళ్లు వచ్చే దాకా మాత్రమే ఈక్విటీలకు 75%దాకా కేటాయించవచ్చు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గించుకోవాలి. రిటైర్మెంట్‌ నాటికి దీన్ని 50 శాతానికి తగ్గించుకోవాలి. ఇలా కేటాయింపులు తగ్గించుకుంటూ రాగా మిగిలిన మొత్తాన్ని ఇతర ఫండ్స్‌కి మళ్లించవచ్చు.

ఎన్‌పీఎస్‌ ప్రయోజనాలు..
ఎన్‌పీఎస్‌లో ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చార్జీలు అత్యంత తక్కువగా 0.01%మేర ఉంటున్నాయి. ఇది కొంత మేర పెరిగినా  రాబడులు అధికంగా ఇచ్చే అవకాశాలున్నందున అంతిమంగా ఇన్వెస్టర్లకు లాభమేనన్నది పరిశ్రమ వర్గాల మాట. పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించడం ఎన్‌పీఎస్‌లో రెండో ఆకర్షణీయ అంశం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద అదనంగా రూ.50,000 మినహాయింపు పొందవచ్చు. సెక్షన్‌ 80సి కింద లభిస్తున్న రూ.1.5 లక్షల డిడక్షన్‌కి ఇది అదనం.

ప్రతికూలాంశాలూ ఉన్నాయ్‌...
మెచ్యూరిటీ తరవాత వచ్చే మొత్తంలో కనీసం 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలన్న నిబంధన ఇబ్బందికరమే. సాధారణంగా యాన్యుటీ పథకాలపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నామంటే.. భవిష్యత్‌లో మళ్లీ కావాలనుకుంటే ఎకాయెకిన వెనక్కి తీసుకోలేకుండా కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో లాక్‌ చేసేస్తున్నట్లే లెక్క.

అలా కాకుండా రిటైర్మెంట్‌ అవసరాలకు తగిన ఆదాయాన్ని అందించేలా డెట్, ఈక్విటీ మేళవింపుతో.. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) గల మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉపయోగకరంగా ఉంటాయన్నది వారి సూచన. మరోవైపు, 50 ఏళ్ల నుంచి ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకుంటూ రావాలన్న నిబంధనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. యాభై ఏళ్లు పైబడినా దూకుడుగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయగలిగే సామర్ధ్యం ఉండే ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కాబట్టి.. ఆ ఆప్షన్‌ వారికే వదిలేయడం మంచిదని సదరు ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ అభిప్రాయం.

ఏదైతేనేం.. ఈక్విటీలకు కేటాయింపులు పెంచే వీలు కల్పించే ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ పరిమితమైన లిక్విడిటీ స్వభావం ఉన్నందున రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఒక్క ఎన్‌పీఎస్‌ మీదే ఆధారపడటం సరికాదన్నది నిపుణుల మాట. రిటైర్మెంట్‌ కోసం ఇతరత్రా సాధనాలకు కూడా పెట్టుబడులు కేటాయించడం మంచిదని వారి అభిప్రాయం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement