పోస్టాఫీస్ వడ్డీ రేట్లపై సమీక్ష
న్యూఢిల్లీ : పోస్టాఫీస్ డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిగణించి త గు నిర్ణయం తీసుకుంటామన్నారు. అధిక వడ్డీ రేటు ఇచ్చే ఈ తరహా పొదుపు పథకాలతో పోటీపడేందుకు తాము కూడా ఫిక్సిడ్ డిపాజిట్ స్కీములను ఆకర్షణీయంగా ఉంచేందుకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వక తప్పడం లేదని, ఫలితంగా వ్యాపారంపై ప్రభావం పడుతోందని బ్యాంకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం చిన్న మొత్తాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు 8.7-9.3% శ్రేణిలో ఉంటున్నాయి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వంటివి చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందికి వస్తాయి. ప్రభుత్వ అండ ఉండే వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల.. వాటితో పోటీపడాల్సి వస్తుండటంతో ఆర్‌బీఐ రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనాలను పూర్తిగా ఖాతాదారులకు బదలాయించలేకపోతున్నామనేది బ్యాంకుల వాదన