న్యూయార్క్ : సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి కీలక పదవిలో నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. బెన్ గోమ్ స్ధానంలో ఈ పదవిని చేపట్టే రాఘవన్ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రభాకర్ బెర్క్‌లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన రాఘవన్ 2018లో గూగుల్ అడ్వర్టైజింగ్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్‌ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు.
రాఘవన్ అంతకుముందు గూగుల్ క్లౌడ్ సేవలు, గూగుల్ యాప్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇక ఐబీఎం, యాహూల్లోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ నెలకు 100 కోట్ల యాక్టివ్ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్ పాత్ర కీలకం. జీ సూట్‌లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ కంపోజ్, డ్రైవ్ క్విక్ యాక్సెస్ వంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్ ప్రభాకర్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని.. అలాఘరిథంలు, ర్యాంకింగ్‌ల విషయంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఆయన సొంతమని, గూగుల్ కంటే ముందే గూగుల్ సెర్చ్‌తో రాఘవన్‌కు అనుబంధం ఉందని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యుడిగా ఈ రంగంలో గొప్ప ఇంజనీరింగ్ మేథస్సుల్లో ఆయన ఒకరని ప్రస్తుతించారు.
Comments
Please login to add a commentAdd a comment