
ఇంటికి సర్వం ఇంటర్ నెట్టే!!
♦ కొనాలన్నా... కట్టించాలన్నా ఆన్‌లైన్ బాసట
♦ అమ్మాలంటే ఈ వెబ్‌సైట్లలో లిస్ట్ చేస్తే చాలు
♦ రుణం కావాలన్నా వీటిని ఆశ్రయిస్తే చాలు
♦ డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం స్టార్టప్ సంస్థలు
♦ టెక్నాలజీ సాయంతో నిర్వహణ కూడా ఈజీ
♦ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సంస్థలూ క్లిక్ దూరంలోనే
♦ ‘గృహ సీమ’ చుట్టూ రకరకాల కంపెనీలు
♦ 8 బిలియన్ డాలర్ల మార్కెట్లో పోటాపోటీ
ఇల్లంటే మాటలు కాదు. కట్టించినా... కట్టింది కొన్నా... రకరకాల తతంగాలు!!. ఇల్లు వెతకటం నుంచి మొదలుపెడితే... రుణం కోసం సరైన బ్యాంకునుఎంచుకోవటం... ఇంటిలోపలి ఇంటీరియిర్స్‌ను చేయించటం... రంగుల నుంచి ఫర్నిచర్ వరకూ అంతా దగ్గరుండి చూసుకోవటం... ఇవన్నీ అయ్యాకే ఇల్లు పూర్తయి గృహ ప్రవేశం సాధ్యపడుతుంది.
సరే! గృహప్రవేశం చేశాం. తరవాతి సంగతో!! ఇంట్లో మనమే ఉంటే... అప్పుడప్పుడు అవసరమయ్యే ఫ్లంబరు, ఎలక్ట్రీషియన్ దగ్గర్నుంచి, రెగ్యులర్‌గా చేయాల్సిన నిర్వహణ పనులు చాలానే ఉంటాయి. ఒకవేళ అద్దెకు ఇవ్వాలనుకుంటే... సరైన వారిని వెదికి పట్టుకోవటం, నెలనెలా వారి నుంచి అద్దె తీసుకోవటం ఇవన్నీ సమస్యలే. ఒకవేళ ఏదో అవసరం ఉండి ఇల్లు అమ్మాలనుకుంటే అది ఇంకా పెద్ద సమస్య. నిజానికి ఈ సమస్యలన్నీ ఒకప్పుడు పెద్దవే. కాకపోతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చిన్నవైపోయాయి. ఎందుకంటే పైన చెప్పిన ప్రతి బాధ్యతనూ తీసుకోవటానికి పదులకొద్దీ ఆన్‌లైన్ సంస్థలున్నాయి. జస్ట్ కంప్యూటర్‌పైనో, మొబైల్ యాప్‌లోనో ఒక క్లిక్ చేస్తే చాలు. తరవాతి కార్యక్రమాలన్నీ అవే చూసుకుంటాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు చాలా పెద్దది కావటంతో ఇపుడు రకరకాల స్టార్టప్‌లు, ఆన్‌లైన్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆ వివరాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం.
ప్రాపర్టీ పోర్టల్స్... నిధుల సమీకరణ నుంచి కొనుగోళ్ల వరకూ..!
ఇతర సంస్థల్లోలానే దేశంలో ప్రాపర్టీ పోర్టల్స్‌లో భారీగా నిధుల సమీకరణ, కొనుగోళ్లు, విలీనాలు జరుగుతున్నాయి. డీల్‌కర్రీ.కామ్, హౌజింగ్.కామ్‌లు 30 శాతం వాటాలను 70 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. ఇటీవలే ఇండియాహోమ్స్.కామ్ 50 మిలియన్ డాలర్లు, కామన్‌ఫ్లోర్.కామ్ 7.5 మిలియన్ డాలర్లు, గ్రాబ్‌హౌజ్.కామ్ 2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. కొనుగోళ్ల విషయానికొస్తే.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్.. ప్రాపర్టీ రీసెర్చ్ అనాలిసిస్ పోర్టల్ ప్రాపర్జీ.కామ్‌ను కొనుగోలు చేసింది. 200 మిలియన్ డాలర్ల ఈక్విటీతో క్వికర్ హోమ్స్.. కామన్‌ఫ్లోర్.కామ్‌ను కొనుగోలు చేసింది. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాప్‌టైగర్.. మకాన్.కామ్‌ను కొనుగోలు చేసింది. రెండేళ్ల కాలంలో స్క్వేర్‌యార్డ్స్ సంస్థ.. రియల్లీజింగ్.ఇన్, ల్యూక్స్ రియల్‌ఎస్టేట్, ఓరిడెన్‌టెక్ ల్యాబ్స్ అనే మూడు కంపెనీలను కొనుగోలు చేసింది.
వర్చువల్ వ్యూ.. రేటింగ్స్..!
ప్రాపర్టీ పోర్టల్స్ ఇపుడు టెక్నాలజీ ఆధారంగా వినూత్న సేవలందిస్తున్నాయి. విక్రయంతో పాటు రెంటల్ అగ్రిమెంట్, ప్రాపర్టీ నిర్వహణ, మేనేజ్‌మెంట్ సర్వీసులనూ అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ డ్రోన్ కెమెరాలు, వర్చువల్ టెక్నాలజీ, త్రీడీ, ఏరియల్ వ్యూ సేవలందిస్తున్నాయి.
మ్యాప్ ఆధారిత సెర్చింగ్..
సంబంధిత స్థిరాస్తులున్న ప్రాంతాన్ని మ్యాప్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు. అంతేకాదు అక్కడున్న ఇతర ప్రాపర్టీల వివరాలు, స్థానిక ఆసుపత్రులు, విద్యా సంస్థలు, షాపింగ్ మాళ్లు, పార్కుల వంటి సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రోడ్లు, మెట్రో, బస్ స్టేషన్స్, విమా నాశ్రయం వంటి రవాణా సదుపాయాల వివరాలూ క్షణాల్లో కళ్లముందుంటాయి.
బిల్డర్, రేటింగ్...
సంబంధిత బిల్డర్/డె వలపర్ తాలూకు ప్రాజెక్టును విక్రయానికి పెట్టడంతో పాటు... తను అంతకు ముందు చేసిన ప్రాజెక్టులేంటి? భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులేంటి? వంటి వివరాలను ప్రాపర్టీ పోర్టల్స్ అందిస్తాయి. దీంతో కస్టమర్లకు ధరల పెరుగుదల ఎలా ఉందనే అంచనా వస్తుంది. పాత ప్రాజెక్ట్‌ల్లోని కస్టమర్ల అభిప్రాయాలను, రివ్యూలను కూడా అందిస్తాయి. ఏ ప్రాంతంలో రియల్టీ డిమాండ్, సప్లయి ఎక్కువగా ఉందో, ఏ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా నివసించాలనుకుంటున్నారో రేటింగ్ రూపంలో సూచిస్తున్నాయి.
స్కైవ్యూ ఫీచర్...
పోర్టల్స్... డ్రోన్ కెమెరాల ద్వారా ప్రాపర్టీల స్కై వ్యూను చిత్రీకరిస్తున్నాయి. దీంతో ప్రాపర్టీ ఉన్న లొకేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాపర్టీతో పాటూ ఆయా ప్రాంతం, అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చు.
వెరిఫైడ్ ప్రాపర్టీస్..
సంబంధిత ప్రాపర్టీలను వెబ్‌సైట్లలో పొందుపరిచే ముందు ఆయా ప్రాపర్టీ పోర్టల్స్ వాటి వివరాలను ధ్రువపరచుకుంటాయి. దీంతో నాణ్యమైన, లీగల్ సమస్యల్లేని ప్రాపర్టీలను కొనుగోలు చేసే వీలు ఉంటుంది.
కొనాలన్నా... అమ్మాలన్నా
ఆన్‌లైన్ స్థిరాస్తి రంగం మొదలైంది ఇక్కడి నుంచే. మీరు ఇల్లు కొనాలనుకుంటే ఈ సంస్థల వెబ్‌సైట్లలో, యాప్‌లలో సెర్చ్ చేస్తే చాలు. అలాకాక మీ ఇల్లు విక్రయించాలనుకున్నా సరే... ప్రాపర్టీ పోర్టన్సేను సంప్రతిస్తే చాలు. అవే వచ్చి ఫొటోలు తీసుకుని, వివరాలు తీసుకుని ఆన్‌లైన్లో పెట్టేస్తాయి. ప్రస్తుతం దేశంలో మ్యాజిక్‌బ్రిక్స్, 99 ఏకర్స్, ఇండియా ప్రాపర్టీ, మకాన్, ఐప్రాపర్టీ, ప్రాపర్టీవాలా, క్లిక్‌ఇండియా, ప్రాప్‌చిల్, కామన్‌ఫ్లోర్, హౌసింగ్, ప్రాపర్టీబజార్, ఇండియాహోమ్స్, ది గార్డియన్, సులేఖ వంటి 50కి పైగా పోర్టల్స్ ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. గతంలో ప్రాపర్టీ ఓనర్లు, మధ్యవర్తుల ద్వారా పాత ఇళ్లను (సెకండ్ హ్యాండ్) విక్రయించేందుకే పరిమితమైన ఈ పోర్టల్స్... ఇప్పుడు నేరుగా డెవలపర్లు/బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని నివాస, వాణిజ్య సముదాయాలను కూడా విక్రయిస్తున్నాయి. దేశంలో ఏడాదికి ఇవి దాదాపు రూ.250 కోట్ల డీల్స్ చేస్తున్నాయని అంచనా.
‘‘జనం పాత పద్ధతులు వదిలేసి ఆన్‌లైన్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ముందుకొస్తున్నారు. గతేడాది గూగుల్ నిర్వహించినగ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. దేశంలోని 20 నగరాల నుంచి 200 మంది బిల్డర్లు పాల్గొన్న ఈ ఫెస్టివల్‌లో మొత్తం 300 డీల్స్ జరిగాయి’’. - నరసింహ జయకుమార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్- 99 ఏకర్స్.కామ్
8 బిలియన్ డాలర్ల మార్కెట్!!
ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ సైజు 38 బిలియన్ డాలర్లు. ఇందులో 20 శాతానికి పైగా స్థిరాస్తి రంగానిదేనన్నది అసోచామ్ నివేదిక సారాంశం. ఆఫ్‌లైన్‌ను కూడా కలుపుకొంటే 2020 నాటికి స్థిరాస్తి పరిశ్రమ 180 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐబీఈఎఫ్ సర్వే అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5-6 శాతం వాటా ఈ రంగానిదే. గతేడాది గూగుల్ నిర్వహించిన సర్వేలో.. దేశంలో గతేడాది జరిగిన 43 బిలియన్ డాలర్ల స్థిరాస్తి లావాదేవీల్లో... 31 బిలియన్ డాలర్లు నివాస సముదాయాలు, మిగిలిన 12 బిలియన్ డాలర్లు వాణిజ్య సముదాయాలవేనని తేలింది.
88 శాతం మంది ఆన్‌లైన్‌లోనే..
దేశంలో ఆన్‌లైన్లో 74% ప్రాపర్టీల కోసమే సెర్చ్ చేస్తున్నారని గూగుల్ సర్వేలో తేలింది. ఇందులో 18-34 మధ్య వయస్సున్న 69% మంది సెల్‌ఫోన్‌లో ప్రాపర్టీలను ఆరా తీస్తుంటే.. మిగిలిన వారు డెస్క్‌టాప్ ద్వారా చేస్తున్నారు. ఇల్లు కొనాలన్న ఆలోచన రాగానే 88% మంది కస్టమర్లు ఆన్‌లైన్ బాటే పడుతున్నారట. అమ్మకాల విషయానికొస్తే.. మార్కెటింగ్ ఉద్యోగుల ద్వారా 50%, ఆన్‌లైన్ ద్వారా 43 శాతం, న్యూస్ పేపర్ల ద్వారా 1 శాతం, ఇతరత్రా 9 శాతం స్థిరాస్తి అమ్మకాలు జరుగుతున్నాయి.
వర్చువల్ త్రీడీ టూర్..
ఇల్లు, ఇంటి పరిసరాలను వర్చువల్ త్రీడీ వ్యూ ద్వారా చూడచ్చు. విజువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫ్లాట్ ఎంత ఎత్తులో ఉంటుంది? ఫ్లోర్ ప్లాన్‌తో పాటు గదుల విస్తీర్ణాలను 360 డిగ్రీల కోణంలో త్రీడీలో చూడొచ్చు. ఫ్లాట్‌లో వెలుతురు వంటి అంశాలూ తెలుసుకోవచ్చు.
ఇల్లు మీది.. బాధ్యత మాది బౌంటీప్రాపర్టీ.కామ్, నిమ్మది.కామ్, ఫస్ట్ ఇంప్రెషన్.కామ్, గ్రేస్టార్.కామ్
సొంతిల్లు ఉన్నా.. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తే మరి ఆ ఇంటిని ఏం చేయాలి? ఎవరికైనా అద్దెకిస్తే అద్దె చెల్లింపులు, ప్రాపర్టీ నిర్వహణ ఎలా? పెపైచ్చు రాత్రికి రాత్రే నకిలీ పత్రాలతో జరుగుతున్న మాయలు సిటీలకు కొత్తేమీ కాదు. వీటికి పరిష్కారం చూపించేవే ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసులు (పీఎంఎస్). అంటే మీ పేరిట వీళ్లే మీ ఇంటిని అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారుడికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. క్రమం తప్పకుండా విద్యుత్, ఆస్తి పన్ను చెల్లింపులు పీఎంఎస్ సేవలో ప్రధానం. ఇల్లు నిర్వహణ పీఎంఎస్‌దే.
మీకు ప్రతినిధిగా...
మీకు అద్దెదారుడికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత కూడా వీరిదే. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి డీల్ కుదిరేందుకు సహకరిస్తారు. ఏ పనైనా యజమానికి చెప్పే చేస్తారు. ప్రతి సేవకూ ఎంతో కొంత చెల్లించాలి. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. పార్కింగ్, అగ్రిమెంట్ వ్యవధి, ఫర్నిషింగ్ తదితర వివరాలిస్తే ఆన్‌లైన్లోనే రెంట్ అగ్రిమెంట్‌ను అందిస్తాయి.
ఎలక్ట్రికల్ వస్తువులే కాదు... సిమెంట్ కూడా బయ్‌ఎలక్ట్రిక్.కామ్. బెస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్.కామ్, ఎలక్రికల్స్ (సి బదులు కె).కామ్, టెస్కో.కామ్
కట్టిన ఇల్లు నేరుగా కొనుక్కుంటే సరే. అలాకాక ఇల్లు కట్టుకునేవారి కోసం సిమెంటును కూడా ఆన్‌లైన్లో అమ్మటం ప్రారంభించింది రిలయన్స్ సంస్థ. సంస్థ తొలుత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనేవారి సౌలభ్యం కోసం ప్రతి బ్యాగుపై యూనిక్ కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు కూడా. కనీసం 25 బ్యాగుల్ని ఆర్డర్ ఇవ్వాలి. 48 గంటల్లోగా డెలివరీ చేస్తారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ ఇసుకను ఆన్‌లైన్లో విక్రయిస్తున్నాయి. రంగులు, కంకర, ఇనుము వంటి నిర్మాణ సామగ్రీ ఆన్‌లైన్‌లో కొనవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇక ఎలక్ట్రికల్ స్విచ్చులు, వైర్ల వంటివి కూడా ఆన్‌లైన్‌లో కొనచ్చు.
‘‘ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సమాచారంతో పాటు కొనుగోళ్లపై రాయితీలివ్వటం మా ప్రత్యేకత. హావెల్స్, యాంకర్, సఫారియా, రాకో, సూర్య, స్నైడర్, రిచెమ్ వంటి సుమారు 256 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు చానల్ పార్టనర్‌గా కొనసాగుతున్నాం కనక మార్కెట్ రేటు కన్నా 20-30% తక్కువ ధరకే విక్రయిస్తాం.’’ - అజయ్, విజయ్ ఎలక్ట్రికల్స్.కామ్
ఫర్నిచర్, ఇంటీరియర్స్‌కు బోలెడన్ని... కస్టమ్ ఫర్నిష్.కామ్, ఫాబ్‌ఫర్నిష్.కామ్, అర్బన్‌ల్యాడర్.కామ్, హోమ్‌డె కార్.కామ్, మస్పర్.కామ్, ఈజీ ఫర్నిష్.కామ్...
ఇల్లు కొనుక్కోవటం, కట్టించటం తరవాతేంటి? ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్. దీనికితోడు ఇంటీరియర్ డిజైనింగ్. ఇంట్లోకి అవసరమైన బెడ్స్, వార్డ్‌రోబ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్స్ వంటి ఫర్నిచర్ కోసం రిటైల్ దుకాణానికెళ్లి బేరమాడటం కొందరి పద్ధతైతే... ఆన్‌లైన్లో కొనటం మరి కొందరి పద్ధతి. అది కూడా ఇంట్లోని గది సైజులకు తగ్గట్టుగా నచ్చిన రంగు, నచ్చిన మెటీరియల్‌ను అంటే కస్టమైజ్డ్ ఫర్నిచర్‌ను ఎంచుకోవచ్చు. రిటైల్ దుకాణాలతో పోల్చుకుంటే ఆన్‌లైన్ ధర తక్కువ కూడా. వీటితో పాటు ఇంటీరియర్ డిజైనర్స్ సేవలూ ఆన్‌లైన్లోనే లభిస్తున్నాయి. ఆన్‌లైన్లో వివరాలిస్తే... డిజైనర్స్ మన ఇంటికి రావటం...అన్నీ కుదిరితే పని మొదలు పెడతారు.
‘‘మేం రిటైల్ షాపులకన్నా 30 శాతం తక్కువ ధరకే ఫర్నిచర్‌ను అందిస్తున్నాం. రిటైల్ షాపుల్లో అసంఘటిత రంగం ఉత్పత్తులే ఎక్కువగా ఉం డటం, రవాణా చార్జీల భారం వంటివి దీనిక్కారణం. అందుకే చాలా మంది తక్కువ ధరకొస్తుంది కదా అని విదేశాల నుంచి ఫర్నీచర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు’’. - మధుకర్ గంగాడి, సీఈఓ- కస్టమర్ ఫర్నిచర్.కామ్