
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణం నేపథ్యంలో.. రిస్కులను ఎదుర్కొనడంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సత్తాను సమీక్షించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా.. నిర్వహణపరమైన, సాంకేతిక రిస్కులను ముందస్తుగానే గుర్తించేందుకు, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవి ఎంత మేర సిద్ధంగా ఉన్నాయో పరిశీలించనుంది.
పెరుగుతున్న రిస్కులను ఎదుర్కొనడానికి అవి ఎంత సిద్ధంగా ఉన్నాయో... ఆ సన్నద్ధతను మెరుగుపరచుకోవటానికి ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలంటూ పీఎస్‌బీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ల(సీటీవో)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు 15 రోజుల గడువు విధించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్‌లో ఈ విషయాలను ట్వీట్ చేశారు.
ఈడీ, సీటీవోలతో కమిటీ...
కేంద్ర ఆర్థిక శాఖ సూచనల ప్రకారం.. ప్రతీ పీఎస్‌బీ.. తమ తమ ఈడీ, సీటీవోలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు.. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న బలహీనతలు, లోపాలను ఈ కమిటీ గుర్తించాలి.
ఆ తర్వాత నిర్వహణపరమైన రిస్కులను ఎదుర్కొనటంలో బ్యాంకింగ్ రంగంలోని ఉత్తమ విధానాలు.. తమ బ్యాంకు పాటిస్తున్న విధానాలను పోల్చి చూడాలి. ఏయే అంశాల్లో తాము వెనుకబడి ఉన్నామో, మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందో పరిశీలించాలి. మొత్తం మీద ఉత్తమ బ్యాంకింగ్ విధానాలు, కనీస ఆమోదయోగ్య ప్రమాణాలతో ఈడీలు, సీటీవోలు నివేదికలు తయారు చేయాలి. సాంకేతిక పరిష్కార మార్గాలతో సహా కార్యాచరణ ప్రణాళికను వాటిలో పొందుపర్చాలి.
Comments
Please login to add a commentAdd a comment