పీఎన్బీ నష్టం.. 5,367కోట్లు | Punjab National Bank reports Q4 net loss of Rs 5367 crore | Sakshi
Sakshi News home page

పీఎన్బీ నష్టం.. 5,367కోట్లు

Published Thu, May 19 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

పీఎన్బీ నష్టం.. 5,367కోట్లు

పీఎన్బీ నష్టం.. 5,367కోట్లు

అధిక నష్టాలు వచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే
మూడింతలు పెరిగిన మొండి బకాయిల కేటాయింపులు

 న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్‌కు రానంతటి నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక క్వార్టర్‌లో ఈ బ్యాంక్‌కు వచ్చాయి. మొండి బకాయిలకు కేటాయింపులు మూడింతలు పెరగడంతో పీఎన్‌బీకి గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.5,367 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఈ బ్యాంక్‌కు రూ.307 కోట్ల నికర లాభం వచ్చింది. విద్యుత్ డిస్కమ్స్, పంజాబ్ ఆహార ధాన్యాల సంబంధిత రుణాల కారణంగా మొండి బకాయిలకు కేటాయింపులు పెరిగాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. ఈ మొండి బకాయిల ఒత్తిడి మరికొంత కాలం కొనసాగుతుందని బ్యాంక్ ఎండి ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ చెప్పారు. రుణ నాణ్యత సమీక్ష(అసెట్ క్వాలిటీ రివ్యూ-ఏక్యూర్)ను పూర్తిగా నిర్వహించామని  పేర్కొన్నారు.

 విద్యుత్ డిస్కమ్స్‌కు రూ.385 కోట్లతో సహా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి మొండి బకాయిలకు రూ.11,380 కోట్లు కేటాయింపులు జరిపామని ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ వివరించారు. దీనికి అదనంగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఆహార ధాన్యాల రుణ నష్టాలకు రూ.167 కోట్లు కేటాయింపులు జరిపామని తెలిపారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి మొండి బకాయిల కేటాయింపులు రూ.3,281 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.

స్థూల మొండిబకాయిలు 6.55 శాతం నుంచి 12.9 శాతానికి, నికర మొండి బకాయిలు 4.06 శాతం నుంచి 8.61 శాతానికి పెరిగాయని వివరించారు. స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో దాదాపు రెట్టింపై రూ.55,818 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. నిర్వహణ లాభం మాత్రం రూ.3,203 కోట్ల నుంచి రూ.3,228 కోట్లకు పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.13,456 కోట్ల నుంచి రూ.13,276 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.11,651 కోట్ల నుంచి రూ.10,824 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.3,792 కోట్ల నుంచి రూ.2,768 కోట్లకు తగ్గిందని తెలిపారు.

బసెల్ -త్రి నిబంధనల కింద క్యాపిటల్ అడెక్వసీ రేషియో 11.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధన నిధులు కోరుతున్నామని పేర్కొన్నారు. కీలకం కాని వ్యాపారాలు విక్రయించాలని యోచిస్తున్నామని తెలిపారు.  క్యూ4 ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ, పీఎన్‌బీ షేర్ బీఎస్‌ఈలో 3.25 శాతం లాభంతో రూ.76.20 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement