సెంట్రల్ బ్యాంక్కు నష్టాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,396 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.666 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.28,376 కోట్ల నుంచి రూ.27,932 కోట్లకు తగ్గిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మూలధనాన్ని రూ.3,000 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనను బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 1.3% లాభపడి రూ.82 వద్ద ముగిసింది.