న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ప్రభుత్వం షాకిచ్చింది. రైళ్లు, స్టేషన్లలో ఐఆర్‌సీటీసీ లేదా దేశీయ రైల్వే సరఫరా చేసే అన్ని కేటరింగ్ సర్వీసులపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే బోర్డుకి కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ విధింపుతో రైళ్లలో, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, స్టేషన్లలో అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు, డ్రింకుల సరఫరాల్లో జీఎస్టీ రేటులో ఏకరూపత సాధించవచ్చని పేర్కొంది. ‘దేశీయ రైల్వే, దేశీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, వారి లైసెన్సీలు రైలలో, ప్లాట్‌ఫామ్‌ల వద్ద సరఫరా చేసే ఆహార పదార్థాలు, డ్రింక్‌లపై ఎలాంటి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్టీ విధించనున్నామని క్లారిటీ ఇస్తున్నాం’ అని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రయాణికుల వద్ద వర్తకులు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు విధిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తిన తర్వాత ఐఆర్‌సీటీసీ పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లను రైళ్లలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తొలుత ఈ పీఓఎస్ బిల్లింగ్ మిషన్లను ట్రైన్ నెంబర్. 12627-28, SBC-NDLS కర్నాటక ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ బేసిస్‌లో ప్రవేశపెట్టారు. వచ్చే వారాల్లో మరిన్ని మార్గాల్లో కూడా ఈ మిషన్లను అందుబాటులోకి తేనున్నట్టు దేశీయ రైల్వే అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment