ఆర్బీఐ కొత్త గవర్నర్పై త్వరలోనే ప్రకటన
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి జైట్లీ గురువారం ప్రధాని మోదీతో ఇదే అంశంపై చర్చలు జరిపారు. ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన జైట్లీ... ప్రస్తుత గవర్నర్ రాజన్ స్థానంలో నియమించేందుకు అర్హులైన వారి పేర్ల గురించి తెలిపినట్లు భావిస్తున్నారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగుస్తుంది. తదుపరి గవర్నర్‌పై ప్రకటన గురించి విలేకరులు జైట్లీని ప్రశ్నించగా... నిర్ణయించిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రితో సంప్రదింపుల తర్వాతే ప్రధాని ఆర్‌బీఐ గవర్నర్‌ను ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోంది.