న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంశం గురువారం రాజ్యసభలో దుమారం రేపింది. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు ఉండేలా ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పార్టీలకతీతంగా ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, చార్జీలపై పరిమితులను విధించడం ఏవియేషన్ రంగ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వివరించారు. అయితే ఈ సమస్యకు తగు పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించగలమని ఆయన చెప్పారు. కానీ, దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, ఎస్‌పీ తదితర పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు.