అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్‌ | Azerbaijan Airlines plane crash Lucky Passenger Another Video Viral | Sakshi
Sakshi News home page

అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్‌

Published Fri, Dec 27 2024 5:02 PM | Last Updated on Fri, Dec 27 2024 5:31 PM

Azerbaijan Airlines plane crash Lucky Passenger Another Video Viral

ఒక ఘోర ప్రమాదం.. అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు?.. దేవుడికి దణ్ణం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారు. కానీ, ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్‌లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌(Azerbaijan Airlines) ప్రమాదం తాలుకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సుబ్ఖోన్‌ రఖిమోవ్‌ అనే ఆ ప్రయాణికుడు అదృష్టంకొద్దీ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. తన ఫోన్‌లో అక్కడి  దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే విమాన తోకభాగంపై, రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. అంతకు ముందు ప్రమాద సమయంలోనూ వైరల్‌ అయిన వీడియో కూడా ఈయనగారు పోస్ట్‌ చేసిందే.

ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. సుబ్ఖోన్‌ రఖిమోవ్ మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై  విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.

బాకు నుంచి రష్యాలోని చెచెన్‌ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్‌(Kazakhstan)లోని అక్టౌలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి.  ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్‌బైజన్‌ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా పాటించారు.

ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని.. పక్షిని ఢీ కొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు.. విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. 

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. ఈ విమాన ప్రమాదం జరిగిందా? అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకస్తాన్‌..  ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్దారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు బైడెన్‌ బంపరాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement