
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు రవీంద్ర ధోలకియా అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ మూడు రోజుల పాలసీ భేటీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం డేటాపై ధోలకియా ప్రశ్నలు లేవనెత్తారు. ద్రవ్యోల్బణం లెక్కింపునకు సరైన విధానం లేకుండా... ద్రవ్యోల్బణాన్ని లకి‡్ష్యత పరిధిలోనే ఉంచాలన్న కార్యాచరణను ఆర్‌బీఐ అనుసరించడాన్ని ప్రశ్నించారు. ఫిక్స్‌డ్ బేస్ వెయిట్ ఇండెక్స్ అన్నది ద్రవ్యోల్బణం లెక్కింపునకు ఉత్తమ విధానం కాదని... చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా ఇండెక్స్ బేస్‌ను మారుస్తున్నారని తెలియజేశారు. ద్రవ్యోల్బణం నియంత్రిత విధానాన్ని అనుసరించేటప్పుడు... కచ్చితమైన, వాస్తవిక లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆర్బీఐ ఎంపీసీ కమిటీలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే సభ్యుడిగా ధోలకియాకు పేరుంది. ఆగస్ట్‌లో జరిగిన పాలసీ భేటీలో రెపో రేటును పావుశాతం పెంచగా, నాడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోలకియా ఓటు వేయడం గమనార్హం.
నేడే ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడి కానున్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 7.1 శాతానికి క్షీణించడం, అదే సమయంలో ద్రవ్యోల్బణం 3.31 శాతం కనిష్టానికి చేరడం వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ విడత కూడా తటస్థ విధానాన్నే అనుసరించొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతం స్థాయిలో ఉండొచ్చన్న అంచనాను ఆర్‌బీఐ గతంలో ప్రకటించింది. అలాగే, 2018–19 వృద్ధి రేటు 7.4–7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ అంచనాలను తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్‌బీఐ నుంచి వ్యవస్థలోకి రూ.10,000 కోట్లు
కాగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ నెల 6న వ్యవస్థలోకి రూ.10,000 కోట్ల నిధుల్ని తీసుకొచ్చి, లభ్యతను పెంచనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment