ఆర్బీఐతొలి ఎంసీసీ సమావేశం ప్రారంభం
• నేడు విధాన ప్రకటన
• రెపో రేటు యథాతథం అంచనాలు
ముంబై: కొత్తగా ఏర్పాటయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అత్యున్నత స్థాయి పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) రెండు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైన 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన ద్వైమాసిక సమావేశం, బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం) ను సమీక్షించి ఇందుకు సంబంధించి మంగళవారం ఒక కీలక ప్రకటన చేయనుంది. అయితే ఇప్పటి వరకూ సమీక్ష నిర్ణయం మార్కెట్ కాలంలోనే జరుగుతుండగా, ఈ సమయాన్ని మధ్యాహ్నం 2.30కి మార్చడం జరిగింది.
కాగా తాజా సమీక్ష సందర్భంగా రేటు యథాతథంగా కొనసాగించడానికే వీలుందని నిపుణులు అంచనావేస్తున్నారు. దాదాపు 65 శాతం మంది బ్యాంకర్లు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కోసం ఆర్‌బీఐ నిరీక్షించే వీలుందని అంచనాలు ఉన్నాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.05 శాతంగా ఉండగా, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 3.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ కీలక రేటుపై నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ ఒక్కరే తీసుకుంటుండగా, ఈ దఫా మెజారిటీ దీనికి ప్రాతిపదిక కానుండడం గమనార్హం. సభ్యులు సమానంగా విడిపోతే... ఆర్‌బీఐ గవర్నర్‌గా అదనపు ఓటు కీలకం అవుతుంది.
తయారీ రంగం బలహీనం: నికాయ్
న్యూఢిల్లీ: తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో పేలవంగా ఉందని నికాయ్ మార్కెట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఆగస్టులో 20 నెలల గరిష్ట స్థాయిలో 52.2 పాయింట్ల వద్ద ఉన్న సూచీ సెప్టెంబర్‌లో 52.1 పాయింట్లకు పడిందని తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది ఆర్‌బీఐ రుణ రేటు- రెపో తగ్గింపునకు వీలుకల్పిస్తున్న అంశంగా వివరించింది. కొత్త ఆర్డర్ల మందగమనం సెప్టెంబర్‌లో తయారీ రంగం బలహీనతకు కారణంగా పేర్కొంది. నికాయ్ సూచీ ప్రకారం 50 పాయింట్ల పైన నమోదు వృద్ధి విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.