డెబిట్ కార్డు చెల్లింపులకు మరింత జోష్
ఎండీఆర్ చార్జీలను కుదించిన ఆర్‌బీఐ
• వెయ్యి రూపాయల వరకు 0.25 శాతం
• ఆపై రూ.2వేల వరకు 0.50%గా ఖరారు
• రూ.1,000 వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ ద్వారా చెల్లిస్తే నో చార్జీ
ముంబై: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా డెబిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మొబైల్ ఫోన్, యూపీఐ యాప్ ద్వారాజరిపే చిన్న మొత్తాల లావాదేవీలపైనా రుసుములను వసూలు చేయరాదని బ్యాంకులకు స్పష్టంచేసింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.ప్రభుత్వానికి చేసే చెల్లింపులు సహా డెబిట్ కార్డుల ద్వారా చేసే రూ.1,000 లోపు అన్ని లావాదేవీలపై ఎండీఆర్‌ను 0.25 శాతానికి పరిమితం చేసింది. అలాగే, రూ.1,000 నుంచి రూ.2,000 లావాదేవీలపై ఎండీర్‌ను గరిష్టంగా0.50 శాతంగా ఆర్‌బీఐ ఖరారు చేసింది.
ఎండీఆర్ అనేది డెబిట్, క్రెడిట్ కార్డు సేవలకు గాను దుకాణాదారుల నుంచి బ్యాంకులు వసూలు చేసే చార్జీ. ప్రస్తుతం ఇది రూ.2,000 విలువ వరకు 0.75 శాతంగా, ఆపై విలువపై 1శాతంగా ఉంది. అలాగే, రూ.1,000 వరకు విలువతో కూడిన లావాదేవీలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయరాదని ఆర్‌బీఐ బ్యాంకులను, ప్రీపెయిడ్ చెల్లింపులకు వీలు కల్పించే సంస్థలను కోరింది. ఐఎంపీఎస్, మొబైల్‌ఫోన్‌లో ూ99# కోడ్ ద్వారా చేసే చెల్లింపులు (యూఎస్‌ఎస్‌డీ), యూపీఐ యాప్ ద్వారా చేసే చెల్లింపులకే ఈ మినహాయింపు లభిస్తుంది. ఇక క్రెడిట్ కార్డు చెల్లింపులపై వసూలు చేసే ఎండీఆర్‌పై ఆర్‌బీఐ ఎలాంటి
పరిమితులు నిర్ణయించలేదు.
వచ్చే జనవరి నుంచి మార్చి వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయని, ఈ లోపు ఎలక్ట్రానిక్ చెల్లింపుల లావాదేవీల చార్జీలపై తగిన సంప్రదింపుల అనంతరం ఓ కార్యాచరణ రూపొందిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.డీమోనిటైజేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ నెల చివరి వరకు డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలను ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ తదితర బ్యాంకులు రద్దు చేశాయి. డిజిటల్‌చెల్లింపులను ప్రోత్సహించేందుకు పెట్రోల్, రైల్వే టికెట్లు, ప్రభుత్వ రంగ బీమా పాలసీల ప్రీమియాన్ని డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా చెల్లిస్తే తగ్గింపు పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమల్లోకితెచ్చింది. లాటరీ ద్వారా బహుమతులను అందించే పథకాన్ని సైతం తీసుకొచ్చింది.