బ్యాంకింగ్‌లో రికవరీ షురూ | RBI reserves ratio among the highest | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌లో రికవరీ షురూ

Published Mon, Dec 31 2018 11:48 PM | Last Updated on Tue, Jan 1 2019 5:25 AM

RBI reserves ratio among the highest - Sakshi

ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్‌ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్‌ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్‌బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను (ఎఫ్‌ఎస్‌ఆర్‌) విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థూల ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. పదకొండు బ్యాంకులను పీసీఏ చట్రం కిందకు తీసుకురావడంతో బ్యాంకింగ్‌ రంగంలో క్రమశిక్షణ వచ్చినట్లయిందని తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్‌ దిగ్గజాల ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ ఫోకస్‌ పెడతామని సూచించింది.

మొండిపద్దులు తగ్గుతున్నాయ్‌ 
ఎఫ్‌ఎస్‌ఆర్‌ ప్రకారం... గత మార్చిలో 11.5 శాతం ఉన్న బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు సెప్టెంబర్‌ నాటికి 10.8 శాతానికి దిగివచ్చాయి. ఇదే కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల జీఎన్‌పీఏలు 15.2 నుంచి 14.8 శాతానికి తగ్గాయి. ప్రైవేట్‌ బ్యాంకుల జీఎన్‌పీఏలు 4 నుంచి 3.8 శాతానికి పరిమితమయ్యాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే మార్చినాటికి బ్యాంకులన్నింటి స్థూల ఎన్‌పీఏలు 10.3 శాతానికి, పీఎస్‌బీల జీఏన్‌పీఏలు 14. 6 శాతానికి, ప్రైవేట్‌ బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.3 శాతానికి తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నికర ఎన్‌పీఏలు గత మార్చిలో 6.2 శాతం ఉండగా మార్చినాటికి 5.3 శాతానికి పతనమయ్యాయి. 2015 అనంతరం అటు స్థూల, నికర ఎన్‌పీఏల్లో అర్ధవార్షిక తరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. రిస్ట్రక్చర్డ్‌ స్టాండర్డ్‌ అడ్వాన్సుల (ఆర్‌ఎస్‌ఏ) నిష్పత్తి సెప్టెంబర్‌ నాటికి 0.5 శాతానికి పతనమైందని, ప్రొవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తి (పీసీఆర్‌) 51 శాతానికి పెరిగిందని, క్యాపిటల్‌ టు రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్‌ నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌) 13.7 శాతానికి వచ్చిందని నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌నాటికి బ్యాంకు పోర్టుఫోలియోల్లో పెద్ద రుణఖాతాలు 54.6 శాతానికి, బ్యాంకుల జీఎన్‌పీఏల్లో బడా బకాయిల వాటా 83.4 శాతానికి చేరాయని వివరించింది. ‘‘ప్రస్తుత ఎన్‌పీఏలు అధికమే. కానీ తరుగుదల రేటును పరిశీలిస్తే ఇవి మరింత దిగొస్తాయనిపిస్తోంది. నిజానికి ఎన్‌పీఏ అంశంలో ఈ మెరుగుదల చాలదు. పీఎస్‌యూ బ్యాంకుల నిర్వహణా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరిన్ని పాలనా సంస్కరణలు తీసుకురావడం, బలహీన పీఎస్‌బీలకు రీక్యాప్‌ సాయం అందించడం తదితర చర్యలు అవసరం’’ అని దాస్‌ చెప్పారు. ఎన్‌పీఏలను గుర్తించే ప్రక్రియతో పీఎస్‌బీల్లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ మెరుగుపడిందన్నారు.
 
క్రమశిక్షణ తెచ్చిన పీసీఏ 
ఇరవై పీఎస్‌బీల్లో 11 బ్యాంకులను పీసీఏ (స్పష్టమైన దిద్దుబాటు చర్యల) పరిధిలోకి తీసుకురావడం మంచిదయిందని దాస్‌ అభిప్రాయపడ్డారు. క్రెడిట్‌ అంచనా, మార్కెట్‌ రిస్కు అంచనాలకు సంబంధించి పీసీఏ కారణంగా బ్యాంకుల్లో క్రమశిక్షణ వచ్చిందన్నారు. దివాలా చట్టం కింద చేర్చిన కేసుల్లో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ చట్టం కారణంగా విత్త క్రమశిక్షణ వస్తుందన్నారు. గత నాలుగు త్రైమాసికాల్లో పీసీఏ కారణంగా 11 పీఎస్‌బీల సాల్వెన్సీ నష్టాలు 73,500 కోట్ల రూపాయల నుంచి 34,200 కోట్ల రూపాయలకు దిగివచ్చాయిని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, స్థూల స్థిర మూలధన ఏర్పాటులో వృద్ధి కారణంగా ఎకానమీలో వృద్ధి ముందుకే సాగుతుందని దాస్‌ అంచనా వేశారు. వాణిజ్య భయాలు తగ్గుతున్నాయన్నారు. ఎఫ్‌సీలపై డేగ కన్ను  భారీ ఆర్థిక సామ్రాజ్యాల (ఎఫ్‌సీ) విత్త స్థిరత్వంలో రిస్కును ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఎత్తిచూపిందని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. వీటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఎఫ్‌సీల్లో కచ్చితమైన రిస్కులుండేందుకు పలు అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎఫ్‌సీల స్థితిగతులను ఐఆర్‌ఎఫ్‌– ఎఫ్‌సీ పర్యవేక్షిస్తోంది. ఐఆర్‌ఎఫ్‌ పర్యవేక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నా, మరింత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. ఇకపై అన్ని ఎఫ్‌సీలు త్రైమాసికానికొకసారి తమ వద్ద జరిగిన ఇంటర్‌గ్రూప్‌ లావాదేవీల డేటాను సమర్పించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఎఫ్‌సీలకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజన్సీలు ఇచ్చే రేటింగ్‌ ప్రమాణాలపై సెబీ తీసుకువచ్చిన మార్పులు అవసరమని తెలిపింది. 

నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు...
∙ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత బహిర్గత రుణభారం 3.6 శాతం తగ్గి 52,970 కోట్ల డాలర్ల నుంచి 51,040 కోట్ల డాలర్లకు చేరింది
∙2017 సెప్టెంబర్‌తో పోలిస్తే గత సెప్టెంబర్‌ నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బాలెన్స్‌ షీటు 17.2 శాతం పెరిగి 26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో ఈ రంగ నికర లాభంలో 16.2 శాతం వృద్ధి నమోదయింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగ స్థూల ఎన్‌పీఏలు 5.8 శాతం నుంచి 6.1 శాతానికి విస్తరించాయి. లోన్సు, అడ్వాన్సుల్లో వరుసగా 16.3, 14.1 శాతం పెరుగుదల నమోదయింది. 
∙విత్త వ్యవస్థలోని మొత్తం ఆర్థిక లావాదేవీల్లో(ఆర్థిక సంస్థల మధ్యన జరిగే లావాదేవీలు– బైలేటరల్‌ ఎక్స్‌పోజర్స్‌) బ్యాంకుల ద్వైపాక్షిక విత్త లావాదేవీల వాటా 46.5 శాతానికి చేరింది. విత్త వ్యవస్థలో ఇలాంటి ద్వైపాక్షిక విత్తలావాదేవీలు అవసరం, కానీ కొన్ని సార్లు ఈ తరహా లావాదేవీలు అనుకోని రిస్కులు వ్యాపించేందుకు కారణమవుతుంటాయి. 
∙నియంత్రణా సంస్థల మధ్య మరింత సహకారం అవసరం. నియంత్రణా సంస్థలు కలిసికట్టుగా పనితీరు కనబరిస్తే చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకొని ఆటలాడే సంస్థల ఆట కట్టించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement