కంపెనీలకు యాక్సిస్ బ్యాంకు హెచ్చరిక
కంపెనీలకు యాక్సిస్ బ్యాంకు హెచ్చరిక
Published Fri, Sep 1 2017 1:16 PM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM
సాక్షి, ముంబై : బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టి, ఏం పట్టనట్టు కాలయాపన చేస్తున్న సంస్థలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉక్కుపాదం మోపుతోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆ సంస్థలపై కఠిన చర్యలకు బ్యాంకులు కూడా సిద్ధమయ్యాయి. బ్యాంకులకు భారీగా బాకీపడిన కంపెనీల అదనపు జాబితాను ఆర్బీఐ రూపొందించిందని, వీటిపై బ్యాంకులు దృష్టిసారించాలని యాక్సిస్ బ్యాంకు చెప్పింది. డిసెంబర్ 13 వరకు వారు తమ సమస్యాత్మక రుణాలను పరిష్కారం చేసుకోకపోతే, దివాలా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని డిఫాల్టర్ సంస్థలను యాక్సిస్ బ్యాంకు హెచ్చరించింది. అయితే ఆ కంపెనీల జాబితాను మాత్రం యాక్సిస్ బ్యాంకు విడుదల చేయలేదు. ఎన్ని కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయో కూడా బహిర్గతం చేయలేదు.
తొలిసారి ఆర్బీఐ జారీచేసిన ఆదేశాల్లో, డిసెంబర్ మధ్య వరకు కంపెనీలు తమ రుణాల సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే దివాలా కోర్టుకు తరలించాలని బ్యాంకులకు పేర్కొంది. ఈ జాబితాలో కనీసం 20 బాకీపడిన కంపెనీలుండగా... వాటిలో 12 అతిపెద్ద డిఫాల్టడ్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం రెండో విడత జాబితాను కూడా ఆర్బీఐ రూపొందించిందని తెలిసింది. వీటిలో 26 వరకు సంస్థలున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులకు అందిస్తున్న కొత్త అధికారాల కింద ఈ సంస్థలు గడువు లోపు బకాయిలను పరిష్కరించుకోకపోతే దివాలా కోర్టుకు తరలించాలని ఆదేశించింది. ఆర్బీఐ జాబితాలోని 12 కంపెనీల రుణాల్లో యాక్సిస్ బ్యాంకు అవుట్‌స్టాండింగ్ లోన్స్ 1843 కోట్లు. నాన్-ఫండ్ అవుట్‌స్టాండింగ్ లోన్స్ 649 కోట్లు.
Advertisement
Advertisement