నేడు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల సమావేశం గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మంగళవారమిక్కడ ప్రారంభమైంది. బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు (రెపో– ప్రస్తుతం 6.25 శాతంగా ఉంది)పై బుధవారం కీలక నిర్ణయాన్ని ఎంపీసీ ప్రకటించనుంది.
ఇటు ప్రభుత్వ వర్గాల నుంచీ, అటు పారిశ్రామిక ప్రతినిధుల నుంచీ రెపో రేటు తగ్గింపునకు డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. వరుసగా ఎనిమి ది త్రైమాసిక సమీక్షల్లో ‘ద్రవ్యోల్బణం’ భయాల కారణంగా యథాతథ రేటు పరిస్థితిని కొనసాగిస్తూ వస్తున్న ఆర్‌బీఐ, ఈ దఫా అరశాతం వరకూ రేటు కోత నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు గణాంకాలూ సానుకూలంగా ఉన్నాయి. ఆయా అంశాలు చూస్తే...
రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.54 శాతానికి చేరింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పతనమయింది. 2017 మే నెలలో వృద్ధి రేటు కేవలం 1.7 శాతంగా నమోదయ్యింది. 2016 ఇదే నెలలో ఈ రేటు 8 శాతం. వృద్ధి పెరగాలంటే పరిశ్రమలకు నిధులు అందుబాటులోకి రావాలి. వడ్డీ రేట్ల పెంపు దీనికి తోడ్పాటునిస్తుంది.
8 పరిశ్రమల కీలక గ్రూప్ వృద్ధి రేటు జూన్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. కేవలం 0.4% వృద్ధి (2016 జూన్ ఉత్పత్తితో పోల్చి– అప్పట్లో వృద్ధి 7%) నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.1%.
నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 47.9 పాయింట్ల క్షీణతకు పడిపోయింది. జూన్‌లో ఈ రేటు 50.9.