ఓ అమ్మాయికి అంబానీ అందమైన జవాబు
న్యూఢిల్లీ: బిలియనీర్ భర్త కావాలన్న భారతీయ అమ్మాయికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఓ అందమైన జవాబు ఇచ్చారు. విజయవంతమైన వ్యాపార వేత్తగా అందాన్ని, డబ్బును విశ్లేషిస్తూ నొప్పించక తానొవ్వక అన్నట్టు ఉన్న ఆయన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పూజా చౌహాన్ అనే యువతి సంధించిన ప్రశ్నలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతను సైతం కదిలించాయి. ఆయన సమాధానం చెప్పకుండా ఉండలేకపోయారు. దీంతో స్వయంగా ముఖేష్ అంబానీయే డైరెక్ట్ గా ఆ అమ్మాయి సందేహాలను నివృత్తి చేస్తూ సమాధానాలు రాశారు. ఇది అందరికీ షాకింగ్ గా ఉండొచ్చు. కానీ ఆ షాకింగ్ నుంచి కాసేపు తేరుకుని అసలు ఆ అమ్మాయి ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఏమని సమాధానమిచ్చారో మీరూ ఓ సారి చదవండి....
పూజ రాసిన లేఖ
నా వయస్సు 25 ఏళ్లు. చాలా అందమైన అమ్మాయిని. మంచి అభిరుచులను కూడా కలిగి ఉన్నాను. ఇంత బాగున్న నాకు, సంవత్సరానికి 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం తెచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏడాదికి రెండు కోట్ల జీతమొస్తే చాలనకుంటే ఈ కాలంలో ఆ మొత్తాన్ని మిడిల్ క్లాస్ గానే పరిగణిస్తున్నారు. అందుకే నేను ఆశపడటంలో ఏమాత్రం తప్పులేదు. ఎక్కువగా కూడా ఏమి కోరుకోవడం లేదు.
ఈ కాలంలో రూ. 100 కోట్ల జీతం వచ్చే వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారందరూ ఎక్కడ ఉన్నారు? వారందరూ పెళ్లిచేసుకున్న వాళ్లేనా? బ్యాచ్ లర్సా? నేను మీలాగా అధిక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలంటే ఏమి చేయాలో చెప్పండి. నేను డేట్ చేసిన వాళ్లందరిలో రూ.50 కోట్ల వేతనం మాత్రమే ఎక్కువ. అదే పెద్ద మొత్తంగా నేను చూశా. విలాస భవంతుల్లో, ప్రాంతాల్లో నివసించాలంటే రూ.50 కోట్లు సరిపోవని నా ఉద్దేశ్యం. నేను నిజాయితీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దయచేసి సమాధానం చెప్పండి
పెళ్లికాని ధనవంతులు ఎక్కడ ఉన్నారు? ఏ గ్రూప్ లను నేను టార్గెట్ చేస్తే కోటీశ్వరులు దొరుకుతారు? ఎందుకు ధనవంతుల భార్యలు సాధారణంగా ఉంటారు? కాని వారు పెద్ద పెద్ద ధనవంతుల్ని పెళ్లిచేసుకున్నారు. ఎలా నిర్ణయించుకుంటారు ఈమె నా భార్య, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని.. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.
-మిస్ పూజా చౌహాన్
డియర్ మిస్ పూజా,
నేను మీ పోస్ట్ ను చాలా ఆసక్తితో చదివాను. నీకున్న ఆశలే చాలామంది అమ్మాయిలకీ ఉంటాయి. కానీ వారు బయటపడరు. ఒక ప్రొఫెషనల్ పెట్టుబడిదారుడిగా నేను నీ పరిస్థితిని విశ్లేషించాలనుకుంటున్నాను. నా ఏడాది జీతం రూ.100 కోట్ల కంటే ఎక్కువ. నీవు కోరుకున్న దానికి నా జీతం సరితూగుతుంది. కాబట్టి నేను ఇక్కడ సమయాన్ని వృథా చేయట్లేదని మీరు నమ్ముతున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సరియైన వాడినే.
నా దృష్టిలో నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది బాడ్ డెసిషన్. అందానికి, పెళ్లికి సంబంధించి ఎక్కువగా నీవు అడిగావు. అందమనేది క్రమంగా అంతరించిపోతుంది. అదే డబ్బైతే ఎలాంటి కారణాలు లేకుండా నశించదు. నిజమేమిటంటే నా ఆర్థికవేతనం ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ నీవు మాత్రం ఏడాది తర్వాత అందహీనురాలివి అవుతావు. వయస్సు పెరిగే కొద్దీ అందం నశిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆర్థిక పరిభాషలో నన్ను పెరిగే ఆస్తిగా పరిగణిస్తే నిన్ను తరిగిపోయే ఆస్తిగా లెక్కకడతారు. సాధారణ తరుగుదలగా కూడా కాదు విశేషణమైన తరుగుదలుగా గుర్తిస్తారు.
10 ఏళ్ల తర్వాత నీవు అసలు విలువే లేని ఆస్తిగా పరిగణించబడతావు. తరిగిపోతున్న ఆస్తిని ఎవరైనా కోరుకుంటారా చెప్పు. కచ్చితంగా దాన్ని అమ్మడానికే ప్రయత్నిస్తారు. నిన్ను కూడా అంతే. చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా నీ మంచి కోరి చెబుతున్నా విను. రూ.100 కోట్ల ఏడాది జీతం కలిగి ఉన్నోడేమి పిచ్చోడు కాదు. అతను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకోడు కేవలం నీతో డేటింగ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి నేను నీ నీకిచ్చే సలహా ఒక్కటే ఈ ఆలోచన మానుకుని, నీవే రూ.100 కోట్లు సంపాదించేలా ప్రణాళికలు వేసుకో. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగలవు. నా సమాధానం నీకు సాయం చేస్తుందని ఆశిస్తూ..
-ముఖేష్ అంబానీ