
సాక్షి, హైదరాబాద్: అందమైన ఇంటికి అంతకంటే అందమైన వంటగది ఉండాలనే కోరిక అందరిలోనూ పెరుగుతోంది. ఇందుకోసం లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. అందుకే తక్కువ ధరలో, సులువుగా అమర్చుకునే రెడీమేడ్ కిచెన్‌ల వైపు పరుగులు తీస్తున్నారు. రంగురంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ.. ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
మాడ్యులర్ రెడీమేడ్ కిచెన్ అందుబాటులోకి వచ్చాక వంటగది రూపమే మారిపోయింది. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్‌లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను శుభ్రంగా సర్దుకునే అవకాశం ఉంటుంది. వంట పాత్రలు శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్, కూరగాయలు తరుముకోవడానికి గ్రానైట్ టాప్ ఉంటాయి. హబ్స్‌లో కూడా బోలెడు వెరైటీలున్నాయి. గ్లాస్ హబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇల్లు మారినా ఓకే..: మాడ్యులర్ కిచెన్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మాడ్యుల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా సులువుగా విప్పుకోవచ్చు. కొత్త ఇంటికి తరలించుకుని మళ్లీ బిగించుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ కాకుండా కార్పెంటర్ చేత కిచెన్ ఏర్పాటు చేయించుకుంటే ఆ కలపను తొలగించడం సాధ్యం కాదు.
డ్యామేజీ ఎక్కువగా ఉంటుంది. మరో చోట బిగించడం కష్టంతో కూడుకున్న పని. మాడ్యులర్ కిచెన్‌లో ఈ సమస్య ఉండదు. కొన్ని రోజులు పోయాక మళ్లీకొత్త లుక్ రావాలనుకున్న వారు షట్టర్స్ మార్పించుకోవచ్చు. కొత్త డిజైన్లు ఉన్న షట్టర్స్ వేసుకోవడం వల్ల కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్ టాప్‌ను నిర్మించుకున్న వారు కూడా మాడ్యులర్ షట్టర్స్‌ను తెచ్చుకుని బిగించుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో విధాలైన సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి.