సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్ మేకర్ ఒప్పో రంగం సిద్ధం చేసింది. భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పులిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్ చేసింది. రియల్ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఇ) లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని క్రమంగా ఇతర పట్టణాలకు విస‍్తరిస్తామన్నారు.
రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించింది. గూగుల్ ప్లే నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రియల్‌మి పేసా వెబ్‌సైట్ వివరాల ప్రకారం వినియోగదారులు రూ .50 వేల పర్సనల్ లోన్ పొందే అవకాశం కూడా ఉంది. పేసాలోని లెండింగ్‌కార్ట్ ద్వారా సంస్థలు రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి రియల్‌మి పేసా ప్లాట్‌ఫామ్ ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చట.
కాగా ఇండియా మార్కెట్లో చిన్న అప్పులు ఇచ్చేందుకు చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ క్రెడిట్ పేరుతో లెండింగ్ సొల్యూషన్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎంఐ పే తర్వాత రెండో పేమెంట్ సొల్యూషన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఎంఐ క్రెడిట్‌ద్వారా రూ. లక్ష దాకా వ్యక్తిగత రుణసదుపాయాన్ని కల్పిస్తోంది. 2023 నాటికి ఇండియాలో ఆన్‌లైన్ క్రెడిట్ లెండింగ్ మార్కెట్ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎంఐ క్రెడిట్ ద్వారా భారతదేశంలో 19,000 పిన్ కోడ్‌లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment