యాక్సిస్ బ్యాంకు శిఖా శర్మ( ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: ఆర్థికరంగంలో ఆణిముత్యాలుగా రాణించిన బ్యాంకుల మహిళా ఉన్నతాధికారులకు వరుసగా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. ఇప్పటికే ఐసీఐసీఐ సీఎండీ చందా కొచ్చర్ వీడియోకాన్ రుణాల విషయంలో ఆరోపణలు, ఆమె భర్త సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో బ్యాంకు అధికారికి ఆర్‌బీఐ రూపంలో చిక్కులు మొదలయ్యాయి. యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక‍్తం చేసింది. ఈ విషయంలో నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా యాక్సిస్ బ్యాంకు బోర్డును కోరడం ఇపుడు ఆసక్తికరంగా మారిది.
సీఈవోగా వరుసగా నాలుగోసారి శిఖా శర్మను కొనసాగిస్తూ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచన చేయమని ఆర్‌బీఐ సూచించినట్లు బ్యాంకు వర్గాల సమాచారం. ఈ మేరకు బ్యాంకు ఛైర్మన్ సంజీవ్ మిశ్రాకు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొండి బకాయిల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రెగ్యులేటరీ అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ అపాయింట్ మెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఇప్పటికే పలు బ్యాంకులను కోరింది. ఇందులో భాగంగానే శిఖాశర్మ పదవి కొనసాగింపుపై కూడా ఆర్‌బీఐ సూచనలు చేసింది. దీనికితోడు గత సంవత్సరం అక్టోబర్ లోనే యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్‌బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు దీనిపై వ్యాఖ్యానించడానికి యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. ఆర్‌బీఐ, బ్యాంకు మధ్య కమ్యూనికేషన్స్ కచ్చితంగా గోప్యంగా ఉండాలన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలపై బ్యాంకు బోర్డు ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తుందనీ, అనంతరం ఈ సిఫారసులను ఆర్‌బీఐకి పంపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉందనీ, ఈ అంశంపై తుది నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అటు ఆర్‌బీఐ నుంచి కూడా ఈ అంచనాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.
కాగా శిఖాశర్మ 2009లో తొలిసారి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుస్లారు సీఈవోగా బాధ్యతలు చేపట్టగా, రానున్న జూన్ మాసం నుంచి నాలుగవసారి సీఈవోగా ఆమె పదవీకాలం ప్రారంభం కానుంది. అయితే తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ అభ్యంతరాలు శిఖా శర్మ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నట్టేనని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment