ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డ్ హైని నమోదు చేసింది. రూ. 1649 వద్ద ఆర్‌ఐఎల్ 9 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.గత రెండు వారాల్లో 6.5 శాతం వృద్ధిని సాధించింది. దీంతో ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 5.35 లక్షల కోట్లను అధిగమించింది.
ఇటీవల ప్రకటించిన జూన్ క్వార్టర్ మంచి ఫలితాలు, 1:1బోనస్ సిఫార్సు, సహా షెల్ కంపెనీ ప్రమాద వార్త కూడా తోడ్పడిందని అంచనా. ప్రపంచ చమురు దిగ్గజం షెల్‌కు యూరప్‌లోని రోటర్‌డామ్‌లో గల అతిపెద్ద రిఫైనరీ భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకుందన్న వార్తలు దేశీ ప్రయివేట్ రంగ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. అంతేకాదు రోజుకి 4 లక్షల బ్యారళ్ల చమురు శుధ్ది సామర్థ్యం కలిగిన రోటర్‌డామ్ రిఫైనరీని మూసివేయనున్నారనే ఆందోళన కూడా వ్యాపించింది. ఫలితంగా సింగపూర్ తదితర ఆసియా రిఫైనరీ సంస్థలకు మేలు చేకూరనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) మెరుగుపడే వీలున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పిసిఎల్), ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, మాగ్మా ఫిన్‌కార్ప్, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ బిఎస్ఇ ఎస్ అండ్ పి లో టాప్ లో నిలిచాయి.
కాగా ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత కారణంగా ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయింది. దేశీయ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది.