విక్రయానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా సిమెంట్ వ్యాపారం!
రుణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యం
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. తన సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించే సన్నాహాల్లో ఉంది. దీనికి సంబంధించి సంప్రదింపులు చివరిదశలో ఉన్నాయని.. త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొనుగోలుదారుల జాబితాలో దేశీ, విదేశీ సంస్థలున్నాయని, బ్లాక్‌స్టోన్, కార్లయిల్, కేకేఆర్ తదితర సంస్థలు ప్రధానంగా ఉన్నాయని వెల్లడైంది.
ఈ ఏడాది మార్చి నాటికి రూ.25,100 కోట్లుగా ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడమే రిలయన్స్ ఇన్‌ఫ్రా తాజా చర్యల ప్రధానోద్దేశం. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ.. భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత డీల్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, సిమెంట్ వ్యాపారం విక్రయ డీల్ రూ.5,000-6,000 కోట్లుగా ఉండొచ్చని. అందులో సగం రుణ చెల్లింపులకు పోను, కంపెనీ చేతికి దాదాపు రూ. 2,500 కోట్లవరకూ రావొచ్చని అంచనా. రిలయన్స్ సిమెంట్‌కు ప్రస్తుతం 5.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో దీనికి సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. కాగా కంపెనీ భవిష్యత్తు వృద్ధి చోధకంగా ఉన్న డిఫెన్స్ రంగంపై మరింత దృష్టిపెట్టింది. డిఫెన్స్ పరికరాల తయారీకి ఇప్పటికే ఇండస్ట్రియల్ లెసైన్స్‌ను కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. తాజాగా రష్యా డిఫెన్స్ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం ద్వారా మిసైల్స్ తయారీలోకి అడుగుపెడుతోంది కూడా.