Anil Ambani Reliance Group
-
భూటాన్‌లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ
సాక్షి, ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం చేసుకుంది. గ్రూప్ ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మను నియమించింది. జూన్ 20 నుంచి ఈమె నియామకం అమల్లోకి వచ్చింది. కమ్యూనికేషన్ వ్యూహకర్తగా మంచి అనుభవం ఉన్న శర్మ నియామకంతో కంపెనీ పునర్వైభవాన్ని సంతరించు కునే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు. గ్రూప్ కార్పొరేట్ ఇమేజ్, పబ్లిసిటీ ,రిలేషన్ షిప్‌లతో సహా రూపర్ట్ మర్డోక్ యాజమాన్యంలోని స్టార్ ఇండియాలో 15 సంవత్సరాలపాటు పనిచేశారు. అలాగే కొలోన్‌లో ఉన్న జర్మన్ బ్రాడ్‌కాస్టర్ 'డ్యుయిష్ వెల్లే'లో పనిచేశారు. (హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు) పారుల్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా చేరడంపై సంతోషాన్ని ప్రకటించారు అనిల్ అంబానీ. గ్రూప్‌తో ఇది ఆమెకు తొలి వృత్తిపరమైన అనుబంధమే అయినా, టోనీ భార్యగా విస్తృత రిలయన్స్ కుటుంబంలో భాగమేననీ, టోనీ జ్ఞాపకాలు, సేవలు, పారుల్ చేరికతో మరింత ప్రత్యేకంగా నిలుస్తాయని అనిల్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. శర్మ భర్త రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ టోనీ జేసుదాసన్ను ఈ ఫిబ్రవరిలో కన్నుమూశారు. దాదాపు 40 సంవత్సరాల పాటు టోనీ రిలయన్స్ గ్రూప్‌లో విశేష సేవలందించారు. పారుల్ శర్మ మంచి రచయిత. 2020లోకరోనా మహమ్మారి వలసదారుల దుస్థితి , మరణాలపై 'డయలెక్ట్స్ ఆఫ్ సైలెన్స్' అనే పుస్తకాన్ని రచించారు. అలాగే 'కొలాబా' పేరుతో రాసిన మరో పుస్తుతం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) పారుల్ మంచి ఫోటోగ్రాఫర్ కూడా. 2017లో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టడానికి స్టార్ కంపెనీని వీడారు. అనేక దేశాల్లో ఆర్కిటెక్చర్, అర్బన్ ల్యాండ్‌స్కేప్‌లు అండ్ హ్యూమన్ ఫామ్స్ పై శర్మ పనిచేశారు. కుంభమేళాపై ఆమె చేసిన వర్క్ 2019లో ప్రతిష్టాత్మక ఫ్లోరెన్స్ పబ్లిక్ మ్యూజియం ‘మారినో మారిని’లో ప్రదర్శించారు. -
ఎన్డీటీవీకి రాఫెల్ సెగ : రూ.10వేల కోట్ల దావా
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన రాఫెల్ డీల్ సెగ ఎన్డీటీవీని తాకింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వివాదంలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎన్డీటీవీపై కోట్ల రూపాయల దావా వేసింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో రిలయన్స్ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం ‘ట్రూత్ వెర్సస్ హైప్స్’పై ఈ కేసు ఫైల్ చేసింది. అయితే దీనిపై ఎన్డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. కాగా రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వివాదానికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ వ్యాఖ్యలతో మరింత అగ్గి రగిలింది. ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్‌గయా’ అంటూ మోదీపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
రాఫెల్ డీల్ : కాంగ్రెస్‌కు రిలయన్స్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై బాధ్యతాయుతంగా మాట్లాడాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్‌లు కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు పంపాయి. రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛ అంటే తమ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ సెర్గిల్‌ను ఉద్దేశించి రిలయన్స్ ఈ నోటీసులో పేర్కొంది. మీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవాస్తవ, తప్పుడు ప్రకటనలను చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కాబోదని నోటీసులో స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై సంయమనంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్‌లు ఈ నోటీసులో జైవీర్ సెర్గిల్‌ను హెచ్చరించాయి. రిలయన్స్‌కు వ్యతిరేకంగా రణదీప్ సుర్జీవాల్, అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్, అనురాగ్ నారాయణ్ సింగ్, ఊమెన్ చాందీ, శక్తి సంహ్ గోయల్,గొహిల్, సునీల్ కుమార్ జకర్. అభిషేక్ మను సింఘ్వీ, సునీల్ కుమార్ జాఖర్, ప్రియాంక చతుర్వేది వంటి కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రిలయన్స్ పేర్కొంది. -
విక్రయానికి రిలయన్స్ ఇన్ఫ్రా సిమెంట్ వ్యాపారం!
రుణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యం న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. తన సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించే సన్నాహాల్లో ఉంది. దీనికి సంబంధించి సంప్రదింపులు చివరిదశలో ఉన్నాయని.. త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొనుగోలుదారుల జాబితాలో దేశీ, విదేశీ సంస్థలున్నాయని, బ్లాక్‌స్టోన్, కార్లయిల్, కేకేఆర్ తదితర సంస్థలు ప్రధానంగా ఉన్నాయని వెల్లడైంది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.25,100 కోట్లుగా ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడమే రిలయన్స్ ఇన్ఫ్రా తాజా చర్యల ప్రధానోద్దేశం. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ.. భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత డీల్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, సిమెంట్ వ్యాపారం విక్రయ డీల్ రూ.5,000-6,000 కోట్లుగా ఉండొచ్చని. అందులో సగం రుణ చెల్లింపులకు పోను, కంపెనీ చేతికి దాదాపు రూ. 2,500 కోట్లవరకూ రావొచ్చని అంచనా. రిలయన్స్ సిమెంట్‌కు ప్రస్తుతం 5.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో దీనికి సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. కాగా కంపెనీ భవిష్యత్తు వృద్ధి చోధకంగా ఉన్న డిఫెన్స్ రంగంపై మరింత దృష్టిపెట్టింది. డిఫెన్స్ పరికరాల తయారీకి ఇప్పటికే ఇండస్ట్రియల్ లెసైన్స్‌ను కూడా రిలయన్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. తాజాగా రష్యా డిఫెన్స్ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం ద్వారా మిసైల్స్ తయారీలోకి అడుగుపెడుతోంది కూడా.