
ఆ డీల్‌పై ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు తప్పవన్న రిలయన్స్..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై బాధ్యతాయుతంగా మాట్లాడాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్‌లు కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు పంపాయి. రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛ అంటే తమ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ సెర్గిల్‌ను ఉద్దేశించి రిలయన్స్ ఈ నోటీసులో పేర్కొంది.
మీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవాస్తవ, తప్పుడు ప్రకటనలను చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కాబోదని నోటీసులో స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై సంయమనంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ ఏరోస్ర్టక్చర్, రిలయన్స్ డిఫెన్స్‌లు ఈ నోటీసులో జైవీర్ సెర్గిల్‌ను హెచ్చరించాయి.
రిలయన్స్‌కు వ్యతిరేకంగా రణదీప్ సుర్జీవాల్, అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్, అనురాగ్ నారాయణ్ సింగ్, ఊమెన్ చాందీ, శక్తి సంహ్ గోయల్,గొహిల్, సునీల్ కుమార్ జకర్. అభిషేక్ మను సింఘ్వీ, సునీల్ కుమార్ జాఖర్, ప్రియాంక చతుర్వేది వంటి కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రిలయన్స్ పేర్కొంది.