న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం మరో మలుపు తిరిగింది. ఎన్డీయే హయాంలో కుదిరిన ఒప్పందం ‘క్లీన్‌డీల్’ అని ఫ్రెంచ్ తయారీ కంపెనీ డసో సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. గత యూపీఏతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎరిక్ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐకి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయంగా సున్నితమైన ఈ ఒప్పందానికి సంబంధించిన పలు విషయాల్ని ఎరిక్ బహిర్గతం చేశారు. సీఈఓ స్థానంలో ఉన్న తాను కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అబద్ధాలు చెప్పడంలేదని అన్నారు. ఎరిక్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఎరిక్ కట్టుకథలు చెబుతున్నారన్న కాంగ్రెస్.. నిష్పాక్షిక విచారణతోనే నిజాలు బయటికొస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ దుష్ప్రచారం ఎరిక్ వ్యాఖ్యలతో బట్టబయలైందని బీజేపీ తిప్పికొట్టింది.
బేరసారాలతో తగ్గిన ధర: ‘ఎన్డీయే కొనే 36 విమానాలు యూపీఏ ఆర్డర్ ఇచ్చిన 18 విమానాలకు రెండు రెట్లు. దీని ప్రకారం ధర కూడా రెట్టింపు కావాలి. అంతర ప్రభుత్వ ఒప్పందం కావడంతో బేర సారాల అనంతరం ధరను 9 శాతం తగ్గించాం. ‘ఫ్లై అవే’ విధానంలో కొనుగోలుచేస్తున్నందున ఎన్డీయే ఒప్పందంలోని 36 విమానాల ధర.. యూపీఏ కుదుర్చుకున్న 126 విమానాల కన్నా తక్కువే’ అని ఎరిక్ తెలిపారు. యూపీఏ ఒప్పందంలో భాగంగా భారత్‌లో తయారుచేయాల్సిన విమానాలు ఏ రకమైనవి, ధరల మార్పులు తదితరాలను ఆయన వెల్లడించలేదు.
రిలయన్స్ ఒక్కటే కాదు..
ఆఫ్‌సెట్ నిబంధనలు పాటించేందుకు తాము రిలయన్స్ డిఫెన్స్‌తో పాటు పలు ఇతర సంస్థల్ని కూడా భాగస్వామ్య సంస్థలుగా ఎంచుకున్నామని ఎరిక్ తెలిపారు. ‘ఈ మేరకు మొత్తం 30 కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నాం. ఒప్పందం మేరకు మొత్తం ఆఫ్‌సెట్ వ్యయంలో 40 శాతాన్ని ఈ కంపెనీలతో కలసి పంచుకుంటాం. అందులో రిలయన్స్ డిఫెన్స్ వాటా 10 శాతమే. మిగిలినదంతా డసో, ఆ కంపెనీల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందంలో భాగం’ అని ఎరిక్ వెల్లడించారు. రిలయన్స్ డిఫెన్స్‌లో డసో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని, కానీ 50:50 నిష్పత్తిలో రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తాయని తెలిపారు. దీని మొత్తం విలువ రూ.800 కోట్లు ఉండొచ్చన్నారు.
యూపీఏ అలా.. ఎన్డీయే ఇలా..: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 126 విమానాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన యూపీఏ.. అందులో 18 విమానాల్ని ‘ఆఫ్ షెల్ఫ్’(అవసరాలతో నిమిత్తం లేకుండా అప్పటికే తయారైనవి) విధానంలో సేకరించడానికి అంగీకరించింది. మిగిలిన వాటిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో స్వదేశంలోనే తయారుచేయించాలని ఒప్పందం చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ ఒప్పం దాన్ని రద్దుచేసి, 36 విమానాల్ని ‘ఫ్లై అవే’(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) షరతుతో కొనుగోలుచేసేందుకు తాజా డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది.
నేను అబద్ధం చెప్పలేదు
Published Wed, Nov 14 2018 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment