సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాది భారతీయ జనతాపార్టీకి కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తొలిసారి పెద్దలసభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య ఈ ఏడాది 67కు చేరనుంది. ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే.. ఈ బలం 98కి చేరుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి రాజ్యసభను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారి దిగువ స్థానంలోకి రానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రాష్ట్రాలనుంచి ఈ ఏడాది బీజేపీ భారీగా పెద్దల సభకు సభ్యులను పంపనుంది.
పతనం దిశగా కాంగ్రెస్
గత మూడేళ్లుగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. అయితే తాజాగా గుజరాత్‌లో తన సంఖ్యా బలం పెంచుకోవడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ 5 రాజ్యసభ సీట్లను కోల్పోనుంది.
ఇతర పార్టీల పరిస్థితి
ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం రీత్యా లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు మరో రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) మరో ఇద్దరిని పెద్దల సభకు పంపనుంది. దీంతో టీఆర్‌ఎస్ మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఐదుకు చేరనుంది. ఇక సమాజ్ వాదీ పార్టీ ఐదు స్థానాలను బీజేపీకి అప్పగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment