
హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం
న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియోకామ్, చైనాకు చెందిన హువాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ఈ ఏడాది 5 వేల పట్టణాల్లో, 2 లక్షలకుపైగా గ్రామాల్లో 4జీ సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ కంపెనీ 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను రిలయన్స్ జియోకు ఎప్పటి నుంచి సరఫరా చేసే అంశంపై (భారత్‌కు దిగుమతి చేసే అంశం) ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఒప్పందంపై అటు రిలయన్స్ జియో కానీ, ఇటు హువాయ్ కంపెనీ కానీ స్పందించలేదు. ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీలతో క్రియాశీలకంగా కలిసి పనిచేస్తామని రిలయన్స్ జియో ఇదివరకే ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ మధ్యనే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఏస్ టెక్నాలజీస్ కార్ప్ నుంచి పలు వస్తు సేవలను పొంద డం కోసం దాదాపు రూ.4,500 కోట్ల నిధులను సేకరించింది. ఏస్ టెక్నాలజీస్ కార్ప్ టెలికం సంబంధిత పరికరాలను, ఇతర సామాగ్రిని రిలయన్స్ జియోకి సరఫరా చేయనుంది.