కాలేజి విద్యార్థులకు వైఫై ఫ్రీ: జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు జియో సిద్ధపడుతున్నట్లు తెలిసింది.
ఈ మేరకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖ(హెచ్‌ఆర్డీ)కు ఓ ప్రపోజల్‌ను కూడా పెట్టినట్లు సమాచారం. గత నెలలో హెచ్‌ఆర్డీకు ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పినట్లు రిపోర్టులు వచ్చాయి.
దీనిపై మాట్లాడిన ఓ హెచ్‌ఆర్డీ అధికారి.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్ ప్రాసెస్‌ను అమలు చేస్తామని అన్నారు. అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెంబర్ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.