
ఫ్రీ జియో ఫోన్.. ప్రీ బుకింగ్స్ త్వరలో..
రిలయన్స్ జియో ఉచిత ఫోన్ కోసం ప్రీ బుకింగ్ త్వరలోనే మొదలుకానున్నాయి
ముంబై:ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో ఉచిత ఫోన్ కస్టమర్లను మురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ సంచలన రిలయన్స్ జియో ఉచిత ఫోన్ కోసం ప్రీ బుకింగ్స్ త్వరలోనే మొదలుకానున్నాయి. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్ (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్) కానున్నాయి. ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ కింద సెప్టెంబరులో ఈ జియో ఫోన్ వినియోగదారుల చేతికి రానుంది. ఇందుకు మరో మూడు రోజుల్లో జియోఫోన్ టెస్టింగ్ ప్రారంభం కానుంది.
'ఇండియా కా స్మార్ట్‌ఫోన్' గా జియో చెప్పుకుంటున్న ఈ 4 జీ వీవోఎల్‌టీఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్ ఆగస్టు 15 నుంచి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను కూడా కంపెనీ వెల్లడించింది కూడా. మరోవైపు వారానికి 50 లక్షల ఫోన్లను విక్రయించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత గానీ ఈ ప్రభావాన్ని అంచనా వేయలేమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా జూలై 21 న రిలయన్స్ ఎజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఆగస్టు 15 నాటికి ఈ పరికరం పరీక్ష కోసం అందుబాటులో ఉంటుందని కంపెనీ వాగ్దానం చేసింది. అలాగే జియో కస్టమర్లకు ఇది పూర్తిగా ఉచితమని ప్రకటించారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా రిఫండ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.