ఈ ఏడాది దివాళీ సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రియలన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది. అయితే జియో ఫోన్ అమ్మకాల్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రిలయన్స్ సరికొత్త బిజినెస్ మోడల్‌ను సిద్ధం చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ ఫలితాలపై రిలయన్స్ రిటైల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దినేశ్ థాపర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫోన్లు, టీవీలు, గృహోపకరణాల సేల్స్ కారణంగా రెండవ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ రెండంకెల వృద్ధిని సాధించినట్లు తెలిపారు. ఇక త్వరలో విడుదల కానున్న జియో ఫోన్ నెక్ట్స్ సేల్స్ పెరిగేందుకు అర్బన్, రూరల్ ఏరియాలకు చేరువయ్యే బిజినెస్ ప్లాన్‌ను అమలు చేయనున్నారు.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని అమ్మే అన్నీ లోకల్ స్టోర్ల సాయంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు రిలయన్స్ రిటైల్ సిద్ధంగా ఉందన్నారు. వారి స్టోర్లలో సైతం జియో మార్ట్‌గా మార్చే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. జియో మార్ట్ డిజిటల్ సేవలు లేదా రిలయన్స్ డిజిటల్ సేవలు అందుబాటులోకి లేని వారికి సైతం ఈ బిజినెస్ మోడల్ ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా,ఈ బిజినెస్ మోడల్ ద్వారా జియో ఫోన్ నెక్ట్స్ సేల్స్ పెంచేందుకు రిలయన్స్ భారీ ప్రయత్నాలు చేస‍్తుంది. రిలయన్స్ రిటైల్లో జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు దారులకు ఆఫర్లు ప్రకటించింది. ఫోన్ కొనుగోలుపై ఈఎంఐ, ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు దినేష్ థాపర్ చెప్పారు. తద్వారా జియో ఫోన్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని రిలయన్స్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment