
హైదరాబాద్: ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు రిలయన్స్ రిటైల్ గట్టి పోటీ ఇవ్వగలదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. రిలయన్స్ టెలికం వ్యాపార విభాగం జియో మార్కెట్లోకి దూసుకెడుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలకు రిలయన్స్ రిటైల్ సవాలు విసరగలదని ఆయన చెప్పారు. ‘ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు రిలయన్స్ రిటైల్ రూపంలో పెద్ద ముప్పు పొంచి ఉంది.
ఎందుకంటే రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా విస్తరించింది. చిన్న, చిన్న రిటైల్ స్టోర్స్‌తో కూడా రిలయన్స్ రిటైల్ అనుసంధానం కాగలదు. సరఫరా చేయడం ద్వారా వ్యాపారాన్ని వేగంగా మెరుగుపర్చుకోగలదు‘ అని పాయ్ వివరించారు. దీంతో రిటైల్‌లో ఈ మూడు సంస్థలే ఉండొచ్చని ఆయన చెప్పారు. వీటిలో మిగతా రెండింటితో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు మరింతగా పెట్టుబడులు పెట్టే సత్తా కూడా ఉండటం రిలయన్స్ రిటైల్‌కి ప్రయోజనం చేకూర్చగలదన్నారు.
మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి మెరుగుపడే కొద్దీ స్టార్టప్ సంస్థలకు కూడా వచ్చే ఏడాది మంచి రోజులు రాగలవని పాయ్ చెప్పారు. ఆరిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అగ్రి–టెక్, మెడికల్ టెక్నాలజీ మొదలైన విభాగాలకు మంచి డిమాండ్ ఉండగలదన్నారు. అటు గతంలో ఎలాంటి స్టార్టప్‌లోకైనా నిధులు వచ్చేసినప్పటికీ.. ప్రస్తుతం సరైన బిజినెస్ ఐడియా ఉంటే తప్ప స్టార్టప్‌లలోకి నిధులు రావడం కష్టంగా మారిందని ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ చెప్పారు.
ప్రస్తుతం బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) కంపెనీల్లో ఎక్కువగా నిధులు వస్తున్నాయన్నారు. ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం లాంటి పెద్ద సంస్థలకు పెట్టుబడులు రాగలవని, చిన్న కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనాల్సి రావొచ్చని బపాలకృష్ణన్ చెప్పారు.