జీఎస్‌టీలో ‘అదనపు పన్ను’ సరికాదు: రంగరాజన్
హైదరాబాద్: అంతర్రాష్ట్ర అమ్మకాలపై ఒక శాతం అదనపు పన్ను ప్రతిపాదన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్పూర్తికి వ్యతిరేకమని ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్ ఇక్కడ పేర్కొన్నారు. ఈ తరహాలో జీఎస్‌టీని అమలు చేయరాదని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన రంగరాజన్ జీఎస్‌టీ విషయంపై తాజాగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. జీఎస్‌టీ వ్యవస్థ ఎంతో మంచి చొరవన్నది తన అభిప్రాయమన్నారు.
దీని అమలు విషయంలో ఒక ఏకాభిప్రాయ సాధన సత్వరం అవసరమని అభిప్రాయపడ్డారు. నల్లధనం వెలికితీతకు తగిన చర్యలు అమలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అయితే ఈ విషయంలో రెండు చర్యలు అవసరం అని మాత్రం అన్నారు. ఇందులో ఒకటి విదేశాల నుం చి నల్లదనాన్ని వెనక్కు తీసుకురావడానికి ఉద్దేశించిందన్నారు. ఇక రెండవది దేశంలో నల్లధనం నిరోధానికి చేపట్టాల్సిన చర్యలని వివరించారు.