క్రాష్ టెస్టులో మరో కారు ఫెయిల్.. 0 స్టార్ రేటింగ్
భారతదేశంలో తయారైన కార్లలో ఇటీవలి కాలంలో బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన కార్లలో.. రెనో డస్టర్ ఒకటి. అయితే ఈ కారు బేస్ మోడల్ మాత్రం క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైంది. అంతర్జాతీయంగా నిర్వహించే గ్లోబల్ ఎన్‌కాప్ క్రాష్ టెస్టులో దీనికి 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వెనకాల సీట్లో ఉన్న పిల్లల రక్షణ విషయంలో దీనికి 2 స్టార్ల రేటింగ్ ఇచ్చారు. 2017 సంవత్సరానికి గాను భారతదేశంలో తయారైన కార్లకు క్రాష్ టెస్టు చేయడం ఇది రెండో రౌండు. తొలిరౌండులో షెవ్రోలె ఎంజాయ్, ఫోర్డ్ ఫిగో యాస్పైర్ కార్లను టెస్ట్ చేశారు. 2014 నుంచి గ్లోబల్ ఎన్‌కాప్ మన కార్లకు క్రాష్ టెస్టులు చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రకారం గంటకు 56 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా కారు ముందు భాగానికి, పక్క భాగాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలని మన దేశంలో చెబుతున్నారు. అయితే గ్లోబల్ ఎన్‌కాప్ మాత్రం 64 కిలోమీటర్ల వేగంతో చూస్తుంది. రెనో డస్టర్ బేసిక్ మోడల్‌కు ఎయిర్‌బ్యాగ్స్ ఉండవు. అందుకే అది ఈ టెస్టులో విఫలమైందని అంటున్నారు. డ్రైవర్ సీట్లో ఎయిర్‌బ్యాగ్ ఉండే డస్టర్ మోడల్‌కు గ్లోబల్ ఎన్‌కాప్ క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే వెనకాల సీట్లో ఉండే పిల్లల రక్షణ విషయంలో మాత్రం 2 స్టార్ రేటింగ్ అలాగే ఉంది. ఇదే మోడల్ డస్టర్ కార్లను లాటిన్ అమెరికా ప్రాంతం కోసం కొలంబియాలో తయారుచేయగా వాటికి 4 స్టార్ రేటింగ్ వచ్చింది. దీనిపై గ్లోబల్ ఎన్‌కాప్ వివరణ ఇస్తూ, భారతదేశంలో తయారయ్యేవాటి కంటే లాటిన్ అమెరికా వాటిలో ఎయిర్‌బ్యాగ్ సైజు పెద్దదని, అందుకే స్టార్ రేటింగ్ మారిందని తెలిపింది.