సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.
మహీంద్రా థార్ రోక్స్
భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.
మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్
భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.
రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment