
న్యూఢిల్లీ: ప్రజాధనాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్లక్ష్యంగా వాడేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి భారీగా మూలధన సాయం పొందుతూ కార్పొరేట్లకు పెద్ద చేత్తో రుణాలుగా సమర్పించుకుంటున్నాయి. వాటిని తిరిగి వసూలు చేసుకోలేక భారీ స్థాయిలో ఎన్‌పీఏలను మూటగట్టుకుంటున్నాయి. తిరిగి మరింత సాయం కోసం ప్రభుత్వం దగ్గర చేయి చాస్తున్నాయి. దీంతో కేంద్ర సర్కారుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ఓ పెద్ద సమస్యగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు.
బ్యాంకులకు నిధులు సర్దుబాటు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా చెమటోడ్చాల్సి వస్తోంది. గత 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వరంగంలోని బ్యాంకులకు కేంద్ర సర్కారు కేటాయింపులు రూ.2.6 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర సర్కారు ఇటీవలి బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల కన్నా రెట్టింపు స్థాయి. రహదారులకు కేటాయించిన దానితో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువ.
నాటి యూపీఏ హయాంలోని ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం నుంచి ప్రస్తుత అరుణ్‌జైట్లీ వరకూ వరుసగా ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధులు కేటాయించుకుంటూ వస్తున్నారు. పోనీ ఈ స్థాయిలో నిధులు తీసుకుంటూ బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను బలోపేతం చేసుకుంటున్నాయా...? అదీ లేదు. మరిన్ని స్కామ్‌లు బయట పడుతున్నాయి. మన బ్యాంకుల్లో గడిచిన ఐదేళ్లలో నీరవ్ మోదీలాంటి వారు రూ.64 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇవీ కేటాయింపులు
ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కోసం కేంద్ర సర్కారు రూ.1.45 లక్షల కోట్లను అందించనుంది. ఇక 2010–11 నుంచి 2016–17 వరకు రూ.1.15 లక్షల కోట్లను బ్యాంకులు ప్రభుత్వం నుంచి పొందాయి. ఈ కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు రూ.1.8 లక్షల కోట్లు. భారీ స్థాయిలో చేరిన ఎన్‌పీఏలకు కేటాయింపుల నేపథ్యంలో దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మరిన్ని నిధులను ఎన్‌పీఏలకు పక్కన పెడుతోంది.
ఇక 18 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఎస్‌బీఐ ఓ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించింది. గడిచిన డిసెంబర్ క్వార్టర్‌లో ఇది చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా ఇంతే. ‘‘పీఎస్‌బీల్లో ఎన్‌పీఏల పరంగా దారుణ పరిస్థితి ఇంకా ముగియలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో మరింత స్పష్టత వస్తుంది’’ అని రేటింగ్ ఏజెన్సీ కేర్ పేర్కొంది.
చెత్త పనితీరుకు నిదర్శనాలు
నష్టాలన్నవి సహజంగానే ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన రాబడుల (ఆర్‌వోఈ)ను ప్రభావితం చేస్తాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఆర్‌వోఈ 12 శాతం వరకూ ఉంటే, ఎస్‌బీఐలో ఇది మైనస్ 0.7 శాతంగాను ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మైనస్ 2.8 శాతంగానూ ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యాపారంలో మాత్రం 70 శాతం వాటా ప్రభుత్వరంగ బ్యాంకులదే.
2016–17లో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల వేతన బిల్లు 8.7 శాతం అయితే, ఎస్‌బీఐ గ్రూపులో ఇది 12.7 శాతం, ఇతర జాతీయ బ్యాంకుల్లో 10.7 శాతం స్థాయిలో ఉంది. అంటే భారీ స్థాయిలో వేతనాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ పనితీరు తీసికట్టుగా ఉంది. అందుకే పీఎస్‌బీల్లో ప్రైవేటు రంగానికి చోటివ్వాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం లోగడ ఓ సందర్భంలో స్వయంగా సూచించారు. ప్రభుత్వ బ్యాంకులు రుణాల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.