రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం ఢమాల్..
న్యూఢిల్లీ : వార్షిక వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) రికార్డు స్థాయిలో కిందకి పడిపోయింది. ఐదేళ్ల కనిష్ట స్థాయిల్లో నమోదైంది. జూన్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 1.54 శాతానికి తగ్గినట్టు నేటి ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. ఆహార ధరలు తగ్గిపోవడం ఈ ద్రవ్యోల్బణం కిందకి పడిపోవడానికి మరింత సహకరించింది. కాగ మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.18 శాతంగా ఉంది. సీపీఐ ఇండెక్స్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వినియోగదారులను కలిపి.. 2012 నుంచి ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణ డేటాను విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి విడుదలైన డేటాలో ఇదే కనిష్ట స్థాయి.
ఆహార ధరలు మే నెలలో 1.85 శాతం పడిపోగా.. గతనెలలో మరింత క్షీణించి ఇవి 2.12 శాతం పడిపోయాయి. కూరగాయల ద్రవ్యల్బణం కూడా 16.5 శాతం కిందకి దిగజారింది. పప్పులు, ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్ నెలలో 21 శాతం క్షీణించింది. మరోవైపు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించింది. గతేడాదిలో ఇదే నెలలో 8 శాతంగా ఉన్న ఈ వృద్ధి మేనెలలో 1.7 శాతానికి పడిపోయినట్టు వెల్లడైంది. రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో ఆర్బీఐ రేట్ల కోతపై మార్కెట్ వర్గాలకు ఆశలు చిగురిస్తున్నాయి.